Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ యూనియన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్
- ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో మహాధర్నా
నవతెలంగాణ-అడిక్‌మెట్
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పీఈటీ, పీడీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ యూనియన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద టీయూపీఈటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్ కృష్ణయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఇందిరా శోభన్, లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు, తెలంగాణ యూనియన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మదగోని సైదులు గౌడ్ హాజరయ్యారు. అనంతరం ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లు గడుస్తున్న ప్రభుత్వ విద్యా సంస్థలో ఖాళీగా ఉన్న పీఈటీ, పీడీ పోస్టులు భర్తీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో వ్యాయామ విద్య ఉపాధ్యాయుల వాటా ఎక్కడ అని ప్రశ్నించారు. శరీర దారుఢ్యానికి, మెదడు చురుకుదనానికి వ్యాయామం తప్పనిసరి అని, అటువంటి వ్యాయామం చేసే ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల హారణ్యరోధన తలెత్తిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పీఈటీ, పీడీ ఉపాధ్యాయులు లేకపోతే విద్యార్థులకు క్రమశిక్షణ ఏ విధంగా లభిస్తుందని ప్రశ్నించారు. వెంటనే ఖాళీగా ఉన్న పీఈటీ, పీడీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మహాధర్నాలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నీలా వెంకటేశ్, రాజ్ కుమార్, భూపేష్ సాగర్, మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ దీపిక బిల్లా, యాదగిరి, ఆంజనేయులు, రాజు లక్ష్మయ్య, సుధాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.