Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాప్రతినిధులకు మరో నీతా..?
- పీర్జాదిగూడలో ప్రజా ప్రతినిధి
- అక్రమ నిర్మాణాలపై చర్యలేవీ..?
- ఎలాంటి అనుమతుల్లేకుండానే బహుళ అంతస్తులు
- మూడేండ్లుగా ట్యాక్స్ చెల్లించని వైనం
- పట్టించుకోని కార్పొరేషన్ అధికారులు
- ఆర్టీఐ ద్వారా వెలుగులోకి విస్తుపోయే నిజాలు
నవతెలంగాణ-బోడుప్పల్
''నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు'' అన్న చందంగా ఉంది పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఓ ప్రజాప్రతినిధి వ్యవ హారం. ప్రభుత్వానికి నష్టం జరిగితే నాకేంటి నా జేబులు నిండితే చాలు అన్నట్టుగా బాధ్యతాయుతమైన పదవిని అడ్డం పెట్టుకొని అడ్డదారులలో అక్రమంగా అంతస్థులపై అంతస్థులను నిర్మించా డు. మరిన్ని నిర్మిస్తున్నాడు. అవినీతి మేడలకు సెల్లార్ తీస్తాడు. అయితే కనీసం ఆ అవినీతి మేడలకు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి గానీ, హెచ్ఎండీఏ నుంచి గానీ అనుమతి తీసుకోవాలనే సోయి మాత్రం లేదు. కానీ తాను నిర్మించే పెద్ద పెద్ద అంతస్థులకు పంచాయతీ అనుమతులు చూపుతాడట. అలాగే అతను మున్సిపల్ ట్యాక్స్ కూడా చెల్లించడం లేదని తెలిసింది. అక్రమ నిర్మాణాలు బహిరంగ రహస్యమే అని.. అయితే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వాటివైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ నిర్మాణాల మాటేంటి సారు..?
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మించిన ఓ నాలుగు అంతస్థుల అద్దాల మేడ కోసం నిబంధనలకు విరుద్ధంగా సదరు ప్రజాప్రతినిధి సెల్లార్ ఏర్పాటు చేయడంతో పాటు కనీస అనుమతి లేకుండా ఏకంగా ఐదు అంతస్థుల భవనం నిర్మాం చారు. ఇందులో మొదటి రెండు అంతస్థులలో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు. అలాగే పై మూడు అంతస్థులలో కన్వెన్షన్ హాల్‌ను నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఫంక్షన్ హల్ నిర్వహణ కోసం నిర్మించే భవనాల కోసం ఖచ్చితంగా హెచ్ఎండీఏ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అలాగే కమర్షియల్ వ్యాపారాల నిర్వహించే భారీ భవంతులకు కూడా హెచ్ఎండీఏ అనుమతితో పాటు ఫైర్ సేఫ్టీ, కనీసం 10 ఫీట్ల సెట్ బ్యాక్ ఉండాలి. అయితే ప్రజాప్రతినిధి అక్రమంగా సుమారు 27,218 చదపరపు అడుగుల (మొత్తం ఆరు అంతస్థులు (సెల్లార్‌తో కలిపి), ఒక్కో అంతస్థు 4,538 చదరపు అడుగులు) విస్తీర్ణంలో నిర్మించిన భవనంలో ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం సంభవిస్తే నిత్యం వందల సంఖ్యలో వచ్చే సందర్శకుల ప్రాణాలు గాలిలో దీపాలనే చెప్పాలి. ఈ భవనాలకు నేటి వరకు ట్యాక్స్ చెల్లించలేదని, ఇప్పటికే డిమాండ్ నోటీసు కూడా జారీ చేశామని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. అయితే కనీస నిబంధనలు కూడా పాటించ కుండా నిర్మించిన ఆ భవంతికి మున్సిపల్ అధికారులు కానీ, హెచ్ఎండీఏ అధికారులు కానీ నేటివరకు నోటీసులు జారీ చేయలేకపోవడానికి ప్రజాప్రతినిధి అధికారమే కారణమనే చర్చ పీర్జాదిగూడలో జోరుగా సాగుతోంది.
ఈ నిర్మాణాల సంగతి అంతే...
ఇక ఆ ప్రజాప్రతినిధి తనకు గతంలో ఉన్న పాత భవంతిని కలుపుతూó కమర్షియల్, రెసిడెన్షియల్ అవసరాల కోసం మరో నాలుగు అంతస్థుల భవనాన్ని నిర్మిస్తున్నట్టు తెలిసింది. ఈ భవనానికి సెల్లార్ కూడా తీశాడు. అయితే ఈ భవనానికి కూడా ఎలాంటి అనుమతి తీసుకోలేదని సమాచారం. కానీ మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వస్తు న్నాయి. ఈ రెండు భవనాలకు కలిపి 5,052 చదరపు మీటర్లు (16,574 చదరపు అడుగులు) విస్తీర్ణంలో ఉన్న ఈ నిర్మాణాలకు రూ.26,767 ట్యాక్స్‌ను గత మూడు సంవత్సరాలుగా చెల్లించడం లేదని, దీంతో వడ్డీతో కలిపి రూ.30,766 రూపాయల ట్యాక్స్‌ను కూడా చెల్లించడం లేదని, ప్రతీ సంవత్సరం డిమాండ్ నోటీసు ఇస్తున్నా పట్టించుకోవడం లేదని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు.
సొంత తమ్ముడికి తెలియకుండానే...ఆస్తి మార్పిడి
అలాగే ప్రస్తుతం ఆ ప్రజాప్రతినిధి నివాసం ఉంటున్న ఇల్లు ఆయన తల్లిపేర ఉంది. కానీ ఇటీవల ఆమె మతిచెందడంతో ఆ ఇంటిని తన సొంత తమ్ముడికి కూడా తెలియకుండానే తన పేర మార్చుకున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసిన అతను ఇటీవల మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిసింది.
నిబంధనలు సామాన్యులకేనా సారూ...
ఇటీవల బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే ఆరోపణలతో పదుల సంఖ్యలో పేదల ఇండ్లను నేలమట్టం చేశారు. కానీ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ప్రభుత్వ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఉన్న అంతస్థులను యదేచ్ఛగా నిర్మిస్తున్నట్టు మీడి యాలో వార్తలు ప్రచురితం అయినా అధికారులు స్పందించకపోవ డానికి కారణం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్వ నిబంధనలు సామాన్యులకు వర్తిస్తాయి గానీ ప్రజా ప్రతినిధులకు వర్తించవా సారూ అని సామాన్య ప్రజలు బాహటంగానే మండిప డుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.