Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కార్ పాఠశాలలపై చిన్నచూపు వద్దు
- స్వచ్ఛంద సంస్థలు నిధులు ఇస్తున్న సర్కార్ నుంచి స్పందన కరువు
ఫౌండేషన్ చైర్మెన్ శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-హయత్నగర్
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలపై సర్కారు చిన్న చూపు చూస్తుంది. దానికి తోడు ఈ ఏడాది పిల్లలు పలు పాఠశాలలో తగినంత లేరనే సాకుతో కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలలు సైతం మూసివేశారు. సర్కారు పాఠశాలకు స్వచ్ఛంద సంస్థలు, ప్రయివేటు వ్యక్తులు నిధులు ఇస్తేనే ఆయా ప్రాంతాల్లో అభివద్ధి జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ పాఠశాలకు నిధులు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నా వాటిని అధ్యాపక బందాలు, సర్కారు పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోవడంతో దాతలు ముందుకు రావడానికి ఆసక్తి చూపడం లేదని స్పష్టం అవుతోంది. ఇదే కోవలో హయత్నగర్ డివిజన్ పరిధిలో నివాసం ఉంటున్న నక్క శ్రీనివాస్ యాదవ్. తన తల్లిదండ్రుల పేరిట ఉన్న నక్క వెంకటమ్మ, నక్క యాదగిరి స్వామి యాదవ్ ఎడ్యుకేషన్, ఫోర్స్ ఫౌండేషన్ను 2012లో స్థాపించాడు. అప్పటి నుంచి పేద విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు. హాస్టల్స్, మెడికల్ క్యాంప్లు, ఉన్నత చదువుల కోసం చదువుతున్న వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చదువులో మెరుగైన ఫలితాలు వచ్చిన చోట అధిక నిధులు అందిస్తున్నారు. అదేవిధంగా విద్యార్థుల ప్రతిభ గుర్తించేందుకు గాను స్కూల్ లెవల్, మండల్, జిల్లా లెవల్, రాష్ట్ర స్థాయిలో పరీక్షలు పెట్టి పోటీ పరీక్షల సర్టిఫికెట్లు, నగదు రివార్డులు సైతం పిల్లలకు ఇస్తున్నారు. 2004 ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం జిల్లెలగూడ, మైరాజ్ పేట, వికారాబాద్, సాహెబ్ నగర్, హయత్నగర్, దండు మైలరాం లలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో రూ.10లక్షల నిధులు ఖర్చు చేశారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హయత్నగర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల అధ్యాపకులు అమలు చేయకుండా ఉండటంతో కమాన్ బోర్డులపై తమ తల్లిదండ్రుల పేర్లు పెట్టకుండా తమను అవమానించారని ఫౌండేషన్ చైర్మెన్ నక్క శ్రీనివాస్ యాదవ్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తాను సుముఖంగా ఉన్నా ప్రభుత్వం నుంచి, అధ్యాపకుల నుంచి సహాయ సహకారాలు లేకపోవడంతో నిధులు ఇవ్వలేకపోతున్నట్లు వాపోయారు.