Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.3866.41 కోట్ల వ్యయంతో 31 ఎస్టీపీల నిర్మాణం
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ మహానగరంలో వంద శాతం మురుగు నీటి శుద్ధి లక్ష్యంగా జలమండలి మూడు ప్యాకేజీల్లో రూ.3866.41కోట్ల వ్యయంతో నిర్మిస్తోన్న 31 ఎస్టీపీల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో ప్రస్తుతం రోజూ 1950 మిలియన్ గ్యాలన్ల మురుగు నీరు ఉత్పత్తి అవుతోంది. ఇందులో జీహెచ్ఎంసీ ప్రాంతంలో 1650 మిలియన్ గ్యాలన్లు ఉత్పత్తి అవుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఉన్న 25 సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ల ద్వారా 772 మిలియన్ గ్యాలన్లు మురుగునీటిని శుద్ధి చేస్తున్నారు. మిగతా 878 మిలియన్ గ్యాలన్ల మురుగు నీటిని శుభ్రం చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం మొదటి దశలో కొత్తగా 31 ఎస్టీపీల నిర్మాణాలను చేపట్టింది. 2036 సంవత్సరం వరకు రాబోయే కాలంలో ఉత్పత్తయ్యే మురుగును శుద్ధి చేసేందుకు వీటిని నిర్మిస్తున్నారు. ఇందులో 978 ఎంఎల్డీల సామర్థ్యం గల ఎస్టీపీలను ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి జీహెచ్ఎంసీ పరిధిలో వంద శాతం మురుగు నీటిని శుద్ధి చేయనున్నారు. మిగిలిన ప్రాంతాల్లోని ఎస్టీపీలను నవంబరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు.
త్వరలో అందుబాటులోకి ఎస్టీపీ
దుర్గం చెరువు వద్ద జలమండలి నిర్మిస్తున్న మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని (ఎస్టీపీ) నెల రోజుల్లో అందుబాటులోకి తేనున్నట్టు ఎండీ దానకిశోర్ తెలిపారు. దుర్గం చెరువు, కోకాపేట్, అత్తాపూర్ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఎస్టీపీలను మంగళవారం ఎండీ సందర్శించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ 7 ఎంఎల్డీల సామర్థ్యం, సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో నిర్మిస్తున్న దుర్గం చెరువు ఎస్టీపీ సివిల్ పనులు 95 శాతం పూర్తయ్యాయని, తొందర్లోనే మిగతా వాటిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. మూడు షిఫ్టుల్లో పనిచేస్తూ తొందరగా పూర్తిచేయాలన్నారు. పనులు జరిగే ప్రాంతంలో, కార్మికులు తగిన భద్రతా చర్యలు పాటించేలా చూడాలని ఆదేశించారు. అన్ని ఎస్టీపీల ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం, పచ్చదనం కోసం గార్డెనింగ్, అవసరమైన మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈడీ డా.ఎం.సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్‌బాబు, ఎస్టీపీ సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.