Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ రమ
నవతెలంగాణ-సంతోష్‌నగర్
స్కీం వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ రమ అన్నారు. స్కీం వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా సంతోష్‌నగర్ క్రాస్ రోడ్డు నుంచి సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్వీ రమ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్కీంల ప్రయివేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఒకవైపు ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు.. మరోవైపు చాలీచాలని వేతనాలతో కేంద్ర, రాష్ట్రాలు ప్రవేశపెట్టిన స్కీం లలో పనిచేస్తున్న వర్కర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మోయలేని పని భారంతో కూనరిల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నదని తెలిపారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి ఎం శ్రావణ్ కుమార్, అధ్యక్షులు మీనా, ఎస్ కిషన్, కె. జంగయ్య, బాలు నాయక్, లతీఫ్, సఫియా, సుల్తానా రాఖి, మహబూబ్ ఉన్నిసా, యూనిస్, ఉమాదేవి, రమణి, కల్పన తదితరులు పాల్గొన్నారు.
స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలి: ఎన్.సబిత
ఘట్కేసర్: కేంద్రం ప్రభుత్వం స్కీంలను ప్రయివేట్‌పరం చేయాలనే యోచనను ఉపసంహరించాలని సీఐటీయూ ఘట్కేసర్ మండల కార్యదర్శి ఎన్.సబిత డిమాండ్ చేశారు. స్కీం వర్కర్లందరికీ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరుతూ శుక్రవారం ఘట్కేసర్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం సీఐటీయూ మండల కార్యదర్శి ఎన్.సబిత మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం పేదల కోసం ఎన్నికలకు ముందు అనేక స్కీంలు ప్రకటించి నేడు వాటిని ప్రయివేట్ పరం చేయాలని చూడటం సరైంది కాదన్నారు. స్కీం వర్కర్లందరూ రోజు పేదలకు అనేక సేవలందిస్తున్నారని, కానీ కేంద్ర ప్రభుత్వం స్కీం వర్కర్లను బానిసలుగా చూస్తుందన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. మధ్యాహ్న భోజనం కార్మికులకు ప్రభుత్వం కోడిగుడ్డు ధర రూ.4.90 మాత్రమే ఇస్తుందని బయట కొనుగోలు చేయడానికి రూ.6 చెల్లించాల్సి వస్తుందన్నారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా విద్యార్థులకిచ్చే మెనూ చార్జీలు పెంచాలన్నారు. రాజకీయ ఒత్తిడిలు లేకుండా చూడాలన్నారు. మధ్యాహ్నం భోజనం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. స్కీం వర్కర్లందరికీ పీఎఫ్. ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన మండల అధ్యక్షురాలు, బి పుష్ప, ప్రధాన కార్యదర్శి ఆర్ శీను, ఉపాధ్యక్షురాలు, బి. సంతోష, సహాయ కార్యదర్శి, ఎం. పద్మ, పి.యాదమ్మ, పి. ఈశ్వరయ్య, ఆర్ జ్యోతి, డి. ధనలక్ష్మి, బి.శివ రాణి, ట్రాన్స్పోర్ట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కడమంచి యాదగిరి, చంద్రమోహన్, సీఐటీయూ మండల నాయకులు కె చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.