Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్లులో ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పలుమార్లు అసెంబ్లీ వేదికగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా అందుకు మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రత్యేక జీవో 892 ద్వారా రూ.56 కోట్ల నిధులు మంజూరు చేశారు. మెదక్ రోడ్డు నుంచి నేషనల్ హైవేకు అనుసంధానం చేస్తూ సుమారు 3.8 కిలోమీటర్ల మేరకు ఉన్న ఈ ప్రధాన లింక్ రోడ్డులో వాహనదారులతో పాటు పరిశ్రమలు ఉన్నందున భారీ వాహనాలు కూడా ప్రయాణించడంతో సింగిల్ లైన్ వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ప్రజల ఇబ్బందులను స్వయంగా గుర్తించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శాశ్వత పరిష్కారం కోసం బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అందుకు అవసరమయ్యే నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్‌ని అభ్యర్థించారు. సమస్య శాశ్వత పరిష్కారానికి భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాస్టర్ ప్లాన్ లో భాగంగా ప్రస్తుతం 60 ఫీట్లు ఉన్న రోడ్డులో 80 ఫీట్లు వెడల్పుగా నాలుగు వరుసలతో స్టీల్ బ్రిడ్జి నిర్మించనున్నారు. స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ పేస్-2 కింద టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే త్వరలో పనులు ప్రారంభం కాన్నున్నాయి. ఈ సందర్భంగా తన అభ్యర్థన మేరకు స్పందించి రూ.56 కోట్లు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే ప్రజల తరఫున మంత్రి కేటీఆర్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.