Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయవంతానికి అధికారులు కృషిచేయాలి
- మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్
- కంటివెలుగపై సమీక్ష సమావేశం
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లాలో అధికారులందరూ సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి విజయవంతం చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. శనివారం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న దృష్ట్యా మున్సిపల్ కమిషనర్లు క్యాంపులు నిర్వహించే చోట్ల కుర్చీలు, టెంట్లు, మూత్రశాలలతో పాటు వైద్య సిబ్బంది రాత్రిపూట బస చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమం ఏఏ రోజు ఎక్కడ నిర్వహిస్తున్నారనే వివరాలను ముందుగానే ఆయ ప్రాంతాల ప్రజలకు తెలియజేసేలా ప్రచారం నిర్వహించాలనీ, ఈ విష యంలో ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. కంటి వెలుగు నిర్వహించేందుకు అవసరమైన క్యాంపు ఏర్పాట్లన్నీ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పూర్తి స్థాయిలో చేయాలని తెలిపారు. పరీక్షలు చేయించుకునే వారి జాబితాను రూపొందించి ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమానికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంపై మున్సిపా లిటీల్లో పెద్ద మొత్తంలో ప్రచారం నిర్వహించడంతో పాటు కంటి వెలుగు నిర్వహించే ప్రాంతాలను ముందుగానే గుర్తించాలన్నారు. ఇందుకు ప్రజా ప్రతినిధుల సహకారంతో పని చేయాలని తెలిపారు. ఆయా కూడళ్లలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి, ప్రసార మాధ్యమాల ద్వారా పెద్ద మొత్తంలో ప్రచారాలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి పద్మజారాణి, డిప్యూటీ డీఎంఅండ్ హెచ్వోలు డాక్టర్ ఆనంద్, డాక్టర్ నారాయణరావు, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ రఘునాథస్వామి, డాక్టర్ సరస్వతి, జిల్లా మాస్ మీడియా అధికారి వేణుగోపాల్ రెడ్డి, మంజుల, మున్సిపల్ కమిషనర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.