Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళలకు పూర్తి భరోసా
- త్వరలో 'ఆమె కోసం ఆమె' ప్రారంభం
- విద్యా సంస్థల్లో సైబర్ అవగాహన కార్యక్రమాలు
- ప్రతి కళాశాల నుంచి చురుకైన విద్యార్థుల ఎంపిక
నవతెలంగాణ-సిటీబ్యూరో/హయత్‌నగర్
పోకిరీలకు సింహస్వప్నంగా రాచకొండ షీ టీమ్స్ నిలిచాయి. మహిళలకు పూర్తి భరోసాను కల్పిస్తున్నాయి. మహిళలు, యువతులను వేధించే ఆకతాయిల ఆగడాలను అరికడుతున్నాయి. రాచకొండ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన డీఎస్ చౌహాన్ మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, షీటీమ్స్ డీసీపీ సలీమాతోపాటు ఏసీపీలు వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డిలను షీటీమ్స్ పనితీరుపై సీపీ అడిగి తెలుసుకున్నారు. ఎల్బీనగర్లోని సీపీ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీపీ చర్చించారు. టీమ్‌లో దాదాపు 300 మందికిపైగా మహిళా కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారని అధికారులు సీపీ దృష్టికి తీసుకెళ్లారు. బాలికల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. గత మూడు రోజుల నుంచి షీ టీం ప్రత్యేక డెకారు ఆపరేషన్లు నిర్వహించి 50 మంది ఈవ్ టీజర్లను పట్టుకున్న తీరును సీపీకి వివరించారు. ఈ ఏడాది 2023 సంవత్సరానికిగాను మహిళలు, బాలికల భద్రత కోసం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. 7వ తరగతి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అన్ని విద్యా సంస్థల్లో సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు కసరత్తు మొదలు పెట్టారు. ప్రత్యేకంగా కళాశాల విద్యార్థుల కోసం 'ఆమె కోసం ఆమె' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకుగాను ప్రతీ కళాశాల నుంచి ఒకరు లేదా ఇద్దరు చురుకైన విద్యార్థినులను గుర్తించి, వారికి 'ఆమె కోసం ఆమె' అని నామకరణ చేయనున్నారు. ముఖ్యంగా షీ టీమ్స్ పనితీరు, వారు చేస్తున్న కార్యక్రమాలలో అమ్మాయిలకు శిక్షణ ఇవ్వనున్నారు.
కఠినంగా వ్యవహరించాలి
ఆకతాయిలు, పోకిరీల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులకు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ఆదేశించారు. పోకిరీల వేధింపుల నుంచి బాలికలను, మహిళలను రక్షించడంతోపాటు పోలీసుల పట్ల వారిలో గౌరవాన్ని, పూర్తి భరోసాను నింపాలన్నారు. రాచకొండ అర్బన్, గ్రామీణ వాతావరణం రెండు కలయికలుండటంతో అన్ని ప్రాంతాల్లో నిరంతరం పెట్రోలింగ్‌తోపాటు డెకారు ఆపరేషన్ నిర్వహించాలని సూచించారు. సైబర్ స్టాకింగ్‌ను అరికట్టడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలు, నివాస ప్రాంతాలలో పోకిరీలు, సైబర్ నేరాలతోపాటు ఇతర నేరాలపై తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అవసరమైతే భయం లేకుండా పోలీసులను సంప్రదించే విధంగా మహిళలకు విశ్వాసం, నమ్మకాన్ని కల్పించాలన్నారు. అవగాహన కల్పించేందుకు బాలికల వసతి గహాల యజమానులు కృషి చేయాలన్నారు. మహిళా హాస్టల్స్లొ ఉంటున్న వారి కోసం (పేయింగ్ గెస్ట్) భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాలతోపాటు సెక్యురిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఐదడుగుల కాంపౌండ్ వాల్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు.