Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేవైఎం సిటీ సెక్రెటరీ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ-అంబర్‌పేట
తెలంగాణ రాష్ట్రంలో విద్యా,వైద్యం పూర్తిగా గాలికి వదిలేసి నిర్లక్ష్యం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని భారతీయ జనతా యువమొర్చా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఎన్నికలలో గెలుపు కోసం ప్రజలను దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ అనేక రకాల మోసపూరిత వాగ్దానాలను ఇస్తున్నారని దుయ్యబట్టారు. మలక్‌పేట హాస్పిటల్లో గర్భిణీలు, ఇబ్రహీంపట్నంలో కుని ఆపరేషన్ వికటించి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రి ఎందుకు చర్య తీసుకోలేదని ఆయన నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో అమలు చేయకుండా మెరుగైన వైద్యానికి ప్రజలను దూరం చేస్తున్నారు అని అన్నారు. కనీసం పేదవారికీ ఉచిత విద్యను అందించే సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదని ఘాటుగా ఆరోపించారు. ఇకనైనా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆలోచించాలని ప్రవీణ్ కుమార్ హితువు పలికారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని, అస్సలు టాయిలెట్ల సౌకర్యం కూడా లేక విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని విమర్శించారు. విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని తెస్తామని గొప్పలు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఆ మాటలు ఎందుకు గుర్తుకు రావడం లేదని ప్రశ్నించారు. విద్యార్థుల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వంద వైఖరిని అవలంభిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందన్నారు. కార్పొరేట్ కళాశాలలో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేసినా కూడా కనీస చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.