Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంటిచూపు పట్ల నిర్లక్ష్యం వద్దు
- ప్రతిఒక్కరూ టెస్టులు చేయించుకోవాలి
- విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
ఆర్థిక ఇబ్బందులతో కంటిచూపును నిర్లక్ష్యం చేస్తున్న వారిని చైతన్యపరచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన నుంచి పుట్టిందే కంటి వెలుగు కార్యక్రమం అని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు పెద్దబావి శ్రీనివాస్‌రెడ్డి, పద్మ ఐలయ్య యాదవ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మానవ శరీరంలో అన్నిటి కంటే ప్రధానమని తెలిసి కూడా కంటిచూపు పట్ల నిర్లక్ష్యం వహిస్తూ శాశ్వతంగా చూపు కోల్పోతున్న లక్షలాది మందిని చైతన్యపరిచి ఆదుకోవాలనే సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టినదే కంటి వెలుగు కార్యక్రమం అని అన్నారు. కంటిలోపం ఉన్న బాధితులకు అక్కడికక్కడే కండ్ల జోడును అందించడమే కాకుండా అవసరమయ్యే వారికి అపరేషన్లు కూడా సంబంధిత ఆస్పత్రుల్లో చేయిస్తామన్నారు. అంధత్వ నివారణకు 18 ఏండ్లు నిండి ఆపై వయస్సు గల మహిళలు, పురుషులు, కంటికి సంబంధించిన అన్ని సమస్యలు పరీక్షించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మెన్ డా.శ్రీధర్, స్థానిక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి, కార్పొరేటర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వెలుగులు నింపేందుకే..
మీర్పేట్: పేదల జీవితాల్లో అంధత్వం నుంచి వెలుగులు నింపే కార్యక్రమం కంటి వెలుగు అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోరు కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల మన్ననలు పొందిన కార్యక్రమం కంటి వెలుగు అని అన్నారు. చాలా మంది తమకు చూపు తక్కువ అయిందని తెలిసి కూడా ఆస్పత్రికి వెళ్లడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారని వారి కోసమే కేసీఆర్ నేరుగా మున్సిపల్ వార్డులు, గ్రామాల్లోకి వెళ్లి శిబిరాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఆరోగ్య శాఖ చేస్తున్న కంటి వెలుగు ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, జిల్లా ఆరోగ్య అధికారులు వెంకటేశ్వర్లు, మీర్పేట్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ప్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ గౌరీ శంకర్, మున్సిపల్ కమిషనర్ నాగేశ్వర్, బాలాపూర్ తహసీల్దార్ జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు.