Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డంపింగ్ యార్డుగా మారుతున్న వైనం
- పట్టించుకోని రెవెన్యూ అధికారులు
నవతెలంగాణ-బాలానగర్
మూసాపేట సర్కిల్ ఫతేనగర్ డివిజన్ పరిధిలోని బాలానగర్ నర్సాపూర్ చౌరస్తా నుండి సనత్ నగర్ రైల్వే స్టేషన్, జింకలవాడ, భరత్ నగర్ వైపు వెళ్లే ప్రధాన రహదారి పక్కన కొందరు వ్యక్తులు అర్ధరాత్రి వేళల్లో టిప్పర్, ట్రాక్టర్ల ద్వారా నిర్మాణ వ్యర్థాలను డంపింగ్ చేస్తున్నారు. గత కొంత కాలంగా రహదారుల పక్కన ఇలా డంపింగ్ చేస్తూ వాహనదారులకు, స్థానికులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం మెరుగైన రహదారులు నిర్మిస్తుంటే కొందరు వ్యక్తులు వాటిని డంపింగ్ యార్డులా వాడు కుంటున్నారు. అర్థ్ధరాత్రి చుట్టుపక్కల ప్రాంతాలనుంచి వ్యర్థాలను తీసుకువచ్చి రోడ్లకిరువైపులా వ్యర్ధాల కుప్పలను వేస్తుండగా, కొన్నిసార్లు దర్జాగా ట్రాక్టర్లు టిప్పర్లలో తీసుకువచ్చి పనికానిచ్చే స్తున్నారు. పరిసర ప్రాంతాలవాసులు కూడా పట్టించు కోవడంలేదు. దీన్ని అడ్డుకోవాల్సిన శాఖల అధికారులు చూసీచూ డనట్లు వదిలేస్తున్నారు. ఎవరూ పట్టించుకోవడంలేదని వ్యర్థాలను తరలించేవారు మరింత దర్జాగా తీసుకువచ్చి ఇక్కడ పోసి వెళుతున్నారు. 47 ఎకరాల స్థలంలోని కో-ఆపరేటివ్ ఇండిస్టియల్ ఎస్టేట్ పరిధిలోని స్థలం ప్రభుత్వం ఇచ్చిన లీజు పూర్తి కావడంతో పురాతనమైన పరిశ్రమ భవనాలను కూల్చివేసి కొందరు నిర్మాణ వ్యర్ధాలను జన సంచారం లేని అర్థరాత్రి వేళల్లో వాటిని రోడ్ల పక్కన డంపింగ్ చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అంతేకాకుండా పరిసర ప్రాంతాలలో ఇండ్ల యాజమానులు, భవన నిర్మాణ దారులు చిన్నచిన్న ఇళ్ళను కూల్చివేసి బహుళ అంతస్తులను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో వెలువడిన భవన నిర్మాణ వ్యర్థాలను వేస్తున్నారు. ఇటీవల పలుమార్లు సంబంధిత అధికారు లపై స్థానికుల ఒత్తిడి వల్ల అక్కడి నుండి తరలిస్తున్నా సదరు నిర్మాణదారుల అలవాటు మారడంలేదు. నిర్మాణ వ్యర్థాలను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించాల్సి ఉన్నా తరలింపు ఖర్చులు మిగుల్చుకునేందుకు ఇలా రహదారుల పక్కన నింపేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.