Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 6గంటల్లో కేసు చేధన : వ్యక్తి అరెస్ట్
నవతెలంగాణ-హయత్‌నగర్
కోయ దొరగా వేషం ధరించి, ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకుని వారి ఇంట్లో ఉన్న నరదిష్టిని తొలగిస్తామని చెప్పి వారి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అపహరించిన వ్యక్తిని ఎల్బీనగర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారని ఎల్బీనగర్ జోన్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. ఆదివారం ఆమె కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలు మీడియాకు వెల్లడించారు. భూపేష్గుప్తా నగర్, మీర్‌పేటకు చెందిన విభూది రాములు స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా. వయస్సు పై బడడంతో సంపాదన సులభంగా సంపాదించాలని అనుకుని ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకుని, వారి ఇండ్లలో నరదిష్టి ఉందని చెప్పి మొదటగా మహిళ మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు బియ్యంలో పెట్టి, పూజలు చేయాలని పసుపు, కుంకుమ తెమ్మని ఆమెను ఇంట్లోకి పంపి అక్కడి నుంచి బంగారంతో పరారవుతాడు. హస్తినాపురంకు చెందిన చీకట్ల వీరలక్ష్మి ఫిిర్యాదు మేరకు 6గంటల్లో నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుండి 6గ్రాముల బంగారు పుస్తెల తాడు, ఒక ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇతను గతంలో నల్గొండ జిల్లా పరిధిలోని డిండి పోలీస్ స్టేషన్ పరిధిలో జైల్‌కు వెళ్ళాడు. సమావేశంలో ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సుధాకర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ రావు, ఎస్ఐ నరేందర్, సిబ్బంది జంగయ్య, బిక్షం, యాదగిరి, శ్రీనివాస్, జంగయ్య, పృధ్వీ తదితరులు పాల్గొన్నారు.