Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని జల్పల్లి మున్సిపాలిటీ జలపల్లి గ్రామంలో ఎస్సీ కులస్తులకు కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని గ్రామస్తులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిని కోరటంతో స్పందించిన మంత్రి స్థలం కేటాయించారు. అందుకుగాను ఆదివారం జిల్లెలగూడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జల్పల్లి మున్సిపాలిటీ బీఅర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు యంజాల జనార్ధన్, యువ నాయకులు యంజాల అర్జున్ ఆధ్వర్యంలో 245 మంది ఎస్సీ సోదరులు మంత్రిని కలిసి ఎస్సీ కమ్యూనిటీ భవనం కొరకు కేటాయించిన స్థలానికి సంబంధించి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం స్థానిక సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు. అలాగే స్మశానవాటిక, చివరి మజిలీ కొరకు కూడ స్థలం కేటాయించాలని కోరినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో తాము నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. మంత్రి ప్రకటన విన్న కాలనీవాసులు సంతోషం వ్యక్తపరుస్తూ మేము ఎల్లపుడూ సబితమ్మ వెంటే ఉంటామని, అభివృద్ధి అంటే సబితమ్మ, సబితమ్మ అంటే అభివృద్ధి అని నినాదాలు చేసి హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సూరెడ్డి కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ భద్రమ్మ, ఎస్సీ సెల్ అధ్యక్షులు చెన్నం రాజేష్, పెంటమ్మ, కాంత, యువకులు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.