Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-బేగంపేట్
అగ్నిప్రమాదాల నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం మినిస్టర్ రోడ్లో ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ భవన కూల్చివేత పనులను పర్యవేక్షించారు. పరిసర ప్రాంత ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకొని కూల్చివేత పనులు చేపట్టినట్లు చెప్పారు. కూల్చివేత పూర్తయ్యే వరకు పరిసర ప్రాంత ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటాని తెలిపారు. ప్రమాదం జరిగిన రోజు నుండి ఈ ప్రాంత ప్రజలకు వేరొక ప్రాంతంలో వసతి కల్పించి ఆహారం కూడా అందిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, ఒకొక్కరికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ప్రకటించిందని, వాటిని బాధిత కుటుంబాలకు అందజేస్తామని చెప్పారు. ఇటీవల జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని చేపట్టాల్సిన చర్యలపై మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం కూడా జరిగిందని చెప్పారు. నగరంలో అనుమతి లేని భవనాలు, జనావాసాల మధ్య ఉన్న గోదాముల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భవన యజమానులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.