Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాసంఘాల డిమాండ్
నవతెలంగాణ-హయత్ నగర్
పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భోపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కీసరి నర్సిరెడ్డి అధ్యక్షతన మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిలుగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భోపాల్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం.చంద్రమోహన్, కేవీపీఎస్ నాయకులు సామేలు, వత్తిదారుల సంఘ రాష్ట్ర నాయకులు పగడాల యాదయ్యలు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుండి కార్మికులు బతుకుదెరువు కోసం వచ్చి కడు భారంగా ఇక్కడ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వారికి ఇక్కడ బతకడమే కష్టంగా మారిందన్నారు. పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని, ఇండ్లు నిర్మించుకునే వారికి ఐదు లక్షలు ఇస్తామని గొప్పలు చెప్పి, నేడు ఇల్లు లేని పేదల బాధలను పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాదులో సుమారుగా 10 లక్షల కుటుంబాలు అద్దె ఇంట్లో ఉంటూ కాలమెల్లదీస్తున్నాయన్నారు. పేదలందరికీ ఇండ్లు స్థలాలు ఇండ్లు ఇవ్వాలని, లేనిచో ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని ఇండ్లు కట్టుకుంటామని హెచ్చరించారు. నేడు రాష్ట్రంలో పెద్దోళ్లకు ప్రభుత్వ భూములను అప్పనంగా అప్పజెప్తున్నారని, పెద్దలు అపార్ట్మెంట్లు కట్టుకొని పెద్ద ఎత్తున స్థలాన్ని ఆక్రమించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. పేదలు 60 గజాల భూమి కోసం పోరాడుతుంటే వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలుపాలు చేస్తున్నారన్నారు. రియల్ ఎస్టేట్ వారు భూములు ఆక్రమించుకొని యథేచ్ఛగా విక్రయిస్తుంటే పట్టించుకున్న పాపాన పోవట్లేదని, పేదవాళ్లు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్నా పీకేసి, వారిపై కేసులు పెట్టి చిత్ర హింసలు పెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు జి.మనోహర్, భీమనపల్లి కనకయ్య, దుర్గారావు, ఆలేటి ఎల్లయ్య, సీఐటీయూ నాయకులు మల్లెపాక వీరయ్య, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు సిహెచ్ వెంకన్న, వత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నారం మల్లేష్, రంగారెడ్డి జిల్లా రజక సంఘం ప్రధాన కార్యదర్శి సి మల్లేష్, రంగారెడ్డి జిల్లా గిరిజన సంఘం ఉపాధ్యక్షులు ఎం.గోపి నాయక్, పాల్గొన్నారు.
కుంట్లూరులో జరుగుతున్న స్థలాల పోరాటానికి సంపూర్ణ మద్దతు
తట్టి అన్నారం గ్రామంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 9న అర్హులైన ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాకు ప్రిపరేషన్ మీటింగ్ జరుగుతుండగా మూక్కుమ్మడిగా వందలాది మందితో ఎల్బీనగర్ డీసీపీ పరిధిలో ఉన్న పోలీసు బలగాలు, మీటింగును చుట్టుముట్టి, ప్రజలను భయభ్రాంతుల గురిచేసి అక్కడున్న సీపీఎం జిల్లా నాయకులు ఏర్పుల నరసింహ్మ, తట్టి అన్నారం గ్రామ మాజీ ఎంపీటీసీ నల్ల ప్రభాకర్, బీఎస్పీ నాయకులు సుక్క రవికుమార్, గునుగంటి సౌజన్యలను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భోపాల్ అన్నారు. కనీసం మీటింగులు పెట్టుకొనే స్వేచ్ఛ లేకుండా, ప్రజా సమస్యల మీద మీటింగ్ పెట్టుకుంటే ఒక్కసారిగా పోలీసు బలగాలతో మీటింగ్‌ను ముట్టడి చేసి అరెస్టు చేయడం సరైనది కాదని నరసింహ, ప్రభాకర్ అన్నారు.