Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడేండ్లలో తిరుగులేని అభివృద్ధి సాధించాం
- మరింత అభివృద్ధికి ప్రణాళికతో ముందుకు సాగుతాం
- బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, మేయర్ సామల బుచ్చిరెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
గడిచిన మూడేండ్ల కాలంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి తమ పార్టీ పాలకవర్గ సభ్యులు ఎనలేని కృషి చేశారని భవిష్యత్తులోనూ మరింత ఉత్సాహంగా ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తారని బీఆర్ఎస్ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం ఏర్పాటై మూడేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్, బీఅర్ఎస్ కార్పొరేటర్లలతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఈ మూడేండ్ల పాలనలో చేసిన అభివృద్ధిపై సమీక్షించుకొని భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తామని సంజీవరెడ్డి తెలిపారు. అవిశ్వాసం వార్తల్లో వాస్తవం లేదు. బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశముందనే ఊహాగానాలు పూర్తిగా అవాస్తవాలని మంద సంజీవరెడ్డి తెలిపారు. తమ పార్టీకి చెందిన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు అందరూ సయోధ్యతో ఉన్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీఅర్ఎస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఆయన తెలిపారు.
ఈ మూడేండ్ల పాలనలో అనేక విషయాల్లో సంతృప్తిగా ఉన్నామని భవిష్యత్తులోనూ బృహత్తర ప్రణాళికలతో ముందుకు సాగుతామని మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. మూడేండ్ల కాలంలో రూ.206.13 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. త్వరలోనే బోడుప్పల్ అంబేద్కర్ సర్కిల్ నుండి చిలుక నగర్ రోడ్డును, వీరారెడ్డి నగర్ నుండి మల్లాపూర్ రోడ్డు వెడల్పు పనులు, బోడుప్పల్ బంగారు మైసమ్మ దేవాలయం నుండి చెంగిచెర్ల మార్గాన్ని విస్తరించేందుకు కృషి చేస్తామన్నారు.
అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందించడంలో పాలక వర్గం పూర్తి స్థాయిలో పనిచేసిందని మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణా, సహకార బ్యాంకు డైరెక్టర్ జడిగే రమేష్ యాదవ్, కార్పొరేటర్లు బింగి జంగయ్య యాదవ్, కొత్త చందర్‌గౌడ్, సింగిరెడ్డి పద్మారెడ్డి, కాటపల్లి లత రాంచంద్రారెడ్డి, సీసా వెంకటేష్ గౌడ్, మోదుగు లావణ్య శేఖర్‌రెడ్డి, కొత్త శ్రీ విద్యా చక్రపాణి గౌడ్, దానగళ్ల అనిత యాదగిరి, పులకండ్ల హేమలత జంగారెడ్డి, భూక్య సుమన్ నాయక్, దొంతబోయిన మహేశ్వరి కృప సాగర్, రాసాల వెంకటేష్ యాదవ్, గుర్రాల రమా వెంకటేష్ యాదవ్, జక్కల పద్మా రాములు, బందారపు అంజలి శ్రీధర్ గౌడ్, చీరాల నరసింహ్మ తదితరులు పాల్గొన్నారు.