Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆల్ ఇండియా కాంగ్రెస్ నేత మహేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ -ఎల్బీనగర్
కొత్త పేట్‌లోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను తొలగించి తొమ్మిది మాసాలు గడుస్తున్నా ఇంతవరకు హాస్పిటల్ నిర్మాణం జరగలేదని ఆల్ ఇండియా కాంగ్రెస్ నాయకులు మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం దిల్సుఖ్ నగర్‌లోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను కాంగ్రెస్ నాయకులతో కలిసి అయన సందర్శించారు. ఈ సందర్భంగా మహేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు నగరంలో మూడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మిస్తామని చెప్పారని ఆయన గుర్తు చేశారు. కానీ ఇంత వరకు ఎక్కడా హాస్పిటల్స్ నిర్మాణం మొదలు పెట్టలేదన్నారు. ముఖ్యమంత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లకు శంకుస్థాపన చేసి తొమ్మిది మాసాలు గడుస్తున్నా, హాస్పిటల్ నిర్మాణం కోసం తట్టడు మట్టి తీసిన పాపాన పోలేదన్నారు.తొందరపడి పండ్ల మార్కెట్‌ను తరలించి వ్యాపారస్తులకు, రైతులకు తీవ్ర నష్టం కలిగించారని ఆయన అన్నారు. ఆగమేఘాల మీద మార్కెట్‌ను ఖాళీ చేశారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 11వేల వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర బడ్జెట్లో ఆరోగ్యం కోసం ఎనిమిది శాతం కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కానీ నేడు 4.4 శాతం నిధులు మాత్రమే కేటాయిస్తుందని చెప్పారు. వెంటనే గడ్డి అన్నారంలో హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, టీపీసీసీ కార్యదర్శి నిరంజన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి, ఎల్బీనగర్ ఇంచార్జి మల్రెడ్డి రాంరెడ్డి, రాష్ట్ర నాయకులు జక్కిడి ప్రభాకర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్, లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సుజాత నర్సింహారెడ్డి, స్వర్ణ మాధవి, మధుసూదన్ రెడ్డి, గజ్జి భాస్కర్, శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.