Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాది కాలంగా ఎస్ఓ పోస్టు ఖాళీ
- 8మంది ఏఎస్‌ఓలకు ఒక్కరే..
- పట్టించుకోని జీహెచ్ఎంసీ ఉన్నాతాధికారులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
భూమ్మీద పుట్టిన ప్రతి బిడ్డకూ జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. దానిని విధిగా నమోదు చేయడం ప్రభుత్వ భాధ్యత. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని(హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి) ప్రాంతాల్లో ఈ బాధ్యతను జీహెచ్ఎంసీ నిర్వహిస్తోంది. ఈ విభాగంలో సరిపోను సిబ్బందిలేకపోవడంతో అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా ఏడాది కాలంగా స్టాటిటికల్ ఆఫీసర్(ఎస్ఓ) పోస్టు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడానికి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలూ లేకపోలేదు.
ఆన్లైన్ నమోదు అంతంత మాత్రమే
నగరంలో జనన మరణ గణాంకాలను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రులన్నింటినీ జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌కు అనుసంధానం కల్పిం చాలని నిర్ణయించారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1463 ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులు ఉండగా వీటిలో కేవలం 300 ఆస్పత్రులు మాత్రమే జీహెచ్ఎంసీ ఆన్లైన్ వెబ్‌సైట్‌కు నేరుగా అనుసంధానమయ్యాయని అధికారులు చెబుతున్నారు. నగరంలోని అధిక శాతం ఆస్పత్రులు ఆన్లైన్లో చేరకపోవడంతో అక్కడ జరిగే జనన, మరణాలకు సంబంధించిన వివరాలు జీహెచ్ఎంసీ కార్యాలయాలకు చేరడంలో తీవ్ర జాప్యం కావడం, ఒక్కోసారి అసలు ఈ వివరాలు అందకపోవడంతో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను పొందడంలో నగరవాసులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. నగరంలో ఉన్న 30 జీహెచ్ఎంసీ సర్కిళ్లలో 63 జనన, మరణ రిజిస్ట్రేషన్ యూనిట్లు ఉన్నాయి. ఈ రిజిస్ట్రేషన్ యూనిట్లలో సిబ్బందిని పెంచడం, అన్ని ఆస్పత్రులను ఆన్లైన్లో చేర్పించడం ద్వారా మరింత వేగంగా బర్త్, డెత్ సర్టిఫికేట్లను జారీ చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. కాని ఈ ప్రక్రియ నామ మాత్రంగానే ఉంది. ముఖ్యంగా ప్రయివేటు ఆస్పత్రులకు సంబం ధించిన వివరాలు సకాలంలో అందడంలేదనే విమర్శలూ ఉన్నాయి.
పర్యవేక్షణ లోపం..నకిలీలకు ఊతం
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతీ సంవత్సరం సుమారుగా 1.85లక్షల జననాలు జరుగుతుండగా 45 వేల మరణాలు సంభవి స్తున్నాయని అధికారులు చెబుతున్నారు. గతంలో జీహెచ్ఎంసీకి చెందిన సిటిజన్ సర్వీస్ సెంటర్లలో జనన, మరణ ధ్రువపత్రాలు జారీచేయడంలో పాదర్శకతతోపాటు అధికారుల పర్యవేక్షణ ఉండేది. ఈ బాధ్యత మీ-సేవా కేంద్రాలకు అప్పగించినప్పటి నుంచి సర్టిఫికెట్ల కోసం విచ్చలవిడిగా వసూలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నకిలీ సర్టిఫకెట్ల దందా నడుస్తుందని, అందుకు అనేకసార్లు పోలీసులకు పట్టుబడడమే నిదర్శనం.
ఎస్ఓ పోస్టు ఖాళీ
జీహెచ్ఎంసీ జనన, మరణ ధ్రువపత్రాల జారీ విభాగంలో రెండు స్టాటిటికల్ ఆఫీసర్(ఎస్ఓ) పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కరూ లేరు. ఏడాది కాలంగా ఎస్ఓ ఖాళీగా ఉన్నా అధికారులు పట్టించుకోవడంలేదు. 8మంది ఏఎస్ఓలకుగాను ఒక్కరు మాత్రమే ఉన్నారు. దీంతో రోజువారీగా వెరిఫికేషన్, సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుల పరిశీలన వంటి పనులు సకాలంలో పూర్తికావడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.