Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంతోషనగర్
ఈ నెల 3 నుండి జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్లకు జీతాల పెంపు తదితర సమస్యలపై చర్చించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు మీనా, సీనియర్ నాయకులు ఎండి అబ్బాస్, విట్టల్, సఫియా, సుల్తానా, కౌసర్, యాస్మిన్లు పలువురు ఎమ్మెల్యేలను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 26వేల మంది ఆశా వర్కర్లు పని చేస్తున్నారన్నారు. గత 18ఏండ్ల నుండి రాష్ట్రంలోని పేద ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నా వీరంతా మహిళలు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆశాలను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం ఇవ్వాలని 106 రోజులు ఆశాలు సమ్మె చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఆ సమ్మెకు స్పందించిన సీఎం కేసీఆర్ స్వయంగా ప్రగతి భవన్లో ఆశాలతో సమావేశం ఏర్పాటు చేసి రూ.ఆరు వేల ఫిక్సిడ్ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ఇంత వరకు ఆ హామీని అమలు చేయలేదన్నారు. ఈ వైఖరిని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆశాలకు రూ.10 ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో పని చేస్తున్న ఆశాల సమస్యలు పరిశీలించాలని, ఫిక్సిడ్ వేతనం, ఇతర సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో తగిన బడ్జెట్ కేటాయించాలని వారు కోరారు.