Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ నగర కార్యదర్శి వెంకటేష్
- సంచాలన్ భవన్ ఎదుట ధర్నా
- డివిజనల్ రైల్వే మేనేజర్‌కు వినతి
నవతెలంగాణ- సిటీబ్యూరో, బేగంపేట్
కాచిగూడ రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ప్రతి నెల చట్ట ప్రకారం 7వ తేదీ లోపు వేతనాలు చెల్లించడంతో పాటు ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని హైదరాబాద్ రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నగర అధ్యక్షుడు ఎం.వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ డివిజన్, సౌత్ సెంట్రల్ రైల్వే సంచాలన్ భవన్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించి, అనంతరం డివిజినల్ రైల్వే మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్ డివిజన్లోని కాచిగూడ రైల్వే స్టేషన్లో డైనమిక్ కాంట్రాక్టు సంస్థ కింద సుమారు 50 మంది కార్మికులు హౌస్ కీపింగ్ పని చేస్తున్నారని, ఆల్ సర్వీసెస్ గ్లోబల్ ప్రయివేట్ లిమిటెడ్ కాంట్రాక్టు సంస్థ కింద సుమారు 100 మంది కార్మికులు కోచ్ క్లీనింగ్ పనులు చేస్తున్నా.. వీరికి చట్ట ప్రకారం ప్రతినెలా 7వ తేదీ లోపు వేతనాలు ఇవ్వాలన్నారు. కానీ కాంట్రాక్టర్ ప్రతి నెలా 20 నుంచి 30వ తేదీ, లేదా రెండు నెలలకోసారి వేతనాలు ఇస్తున్నారని మండిపడ్డారు. దానివల్ల కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావునా ప్రతీనెల 7వ తేదీలోపు కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించేలా రైల్వే యాజమాన్యం చర్యలు తీసుకోవాలని వెంకటేష్ డిమాండ్ చేశారు. సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బి.మధు, సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ అధ్యక్షుడు జె.కుమార స్వామి మాట్లాడుతూ రైల్వే కాంట్రాక్టు కార్మికులకు కాంట్రాక్టర్లు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో డ్యూటీకి రావడానికి బస్సు కిరాయిలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందన్నారు. అలాగే కిరాయి ఇండ్లలో ఉంటున్న కార్మికులకు చాలా సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఇండ్లు ఖాళీ చేయాలని సదరు ఇంటి ఓనర్లు బెదిరిస్తున్నారన్నారు. అలాగే నిత్యావర సరుకులు కొనలేని పరిస్థితి ఉంటుందని, దీంతో వారు బయట వ్యక్తుల వద్ద వడ్డీకి డబ్బులు తెచ్చుకొని కుటుంబాలు గడుపుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. 7వ తేదీ లోపు కార్మికులకు కాంట్రాక్టర్ వేతనం ఇవ్వకుంటే రైల్వే యాజమాన్యం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. చట్టప్రకారం ఏడాదికి 18 ఈఎల్, 12 సీఎల్, 12 పండుగ సెలవులతో పాటు పేస్లిప్లు ఇవ్వాలని, కార్మికులపై పనిభారం తగ్గించాలని కోరారు. ఈ ధర్నాలో సీఐటీయూ అంబర్పేట్ జోన్ కమిటీ కన్వీనర్ జి.రాములు, మంజుల, ఈదమ్మ, సాజిదా బేగం తదితరులు పాల్గొన్నారు.