Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆమ్ఆద్మీ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ దిడ్డి సుధాకర్
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ప్రధాని నరేంద్ర మోడీ నిరంకుశ విధానాల వల్ల దేశ ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర ముప్పు ఏర్పడిందని ఆమ్ ఆద్మీ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. హిట్లర్, ముస్సోలినీల నిరంకుశ ప్రభుత్వాలు అంతమైన వందేండ్ల తర్వాత, ప్రపంచం మరోసారి మోడీ వంటి నిరంకుశ నాయకుల ఎదుగుదల ను చూస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ, ఫెడరల్ వ్యవస్థని దుర్వినియోగ పరుస్తూ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీ చర్యలను నిరసిస్తూ మంగళవారం హిమాయత్ నగర్, లిబర్టీలోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమ్ ఆద్మీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఆప్ నాయకులు, కార్యకర్తలు జండాలు, ప్లకార్డులు చేతబూని ప్రధాని మోడీ, బీజేపీలకు వ్యతీరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఈడీ, సీబీఐ, ఐటీ పేర్లు ఉన్న కార్డులను తగులబెట్టారు.ఈ సందర్భంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ 2014 నుంచి నేటి వరకు మురికి, అవినీతి రాజకీయాలకు బీజేపీ యే రారాజు అన్నారు. కేంద్రంలోని అధికార బీజేపీ ఫిరాయింపులకు డబ్బులు వెదజల్లుతూ సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను వంటి సంస్థలను దుర్వినియోగపరుస్తూ, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన బీజేపీయేతర ప్రభుత్వాల ను కూల్చేందుకు మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. దేశంలో ఒక వైపు రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ, మరోవైపు ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తుందన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ 134 సీట్లు గెలిచి ఘన విజయం సాధించిందని తెలిపారు. ఆప్ కార్పొరేటర్లను వేటాడలేక, కొనలేక, రచ్చ సృష్టించడం ద్వారా బీజేపీ మేయర్ ఎన్నికలకు అడ్డుకుంటుందనీ, ఇది ఫుర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమనీ, తక్షణమే ఢిల్లీ మేయర్ ఎన్నిక జరపాలని డిమాండ్ చేశారు. ప్రజలను ఏకం చేయడం ద్వారా సామాజిక ప్రశాంతతను, సౌభ్రాతత్వాన్ని పెంపొందించడానికి బదులు మతం పేరుతో బీజేపీ ప్రజలను చీల్చి అశాంతికి గురి చేస్తుందన్నారు. భవిషత్తులో బీజేపీ దయనీయమైన ఓటమి చవిచూస్తుంద న్నారు. రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు రాము గౌడ్ మాట్లా డుతూ బీజేపీ మోసాలను గమనించి ఢిల్లీ ప్రజలు చిత్తుగా ఓడించారనీ, ఆప్‌కు నమ్మకంగా ఓటు వేశారని తెలిపారు. ఢిల్లీ మేయర్ ఎన్నికను అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించి, వెంటనే ఢిల్లీ మేయర్ ఎన్నికకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆప్ హైదరాబాద్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఆఫస, కమిటీ కన్వీనర్ మజీద్, నాయకులు గఫ్ఫార్, రమేష్, శ్రీనివాస్, జావీద్, పరీక్షణ్, పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.