Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
నిబంధనలను విరుద్ధంగా అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు రెండు లారీలను సీజ్ చేసిన సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషను పరిధిలో గురువారం చోటు చేసుకుంది. మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హయత్ నగర్‌కు చెందిన ఐతగొని సాయిరాం (22) ఐతగోని వెంకటేష్ (52)లు యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం లక్ష్మీ దేవి కాల్వ నుంచి సర్కారు నిబంధనలను విరుద్ధంగా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తూ వ్యాపారం చేస్తున్నారు. అదే క్రమంలో గురువారం వారికి చెందిన లారీలు టీఎస్ 07 యూకే 8985,టీఎస్ యూజీ 2339 నెంబరు కలిగిన లారీల ద్వారా బోడుప్పల్ ప్రాంతంలో ఇసుక డంప్ చేస్తుండగా అనుమానం వచ్చిన ఇసుక లారీ యాజమానుల అసోసియేషన్ సభ్యులు తనిఖీలు చేశారు. దాంతో అసలు విషయం బయటపడింది.గత కొన్ని రోజులుగా సదరు వ్యక్తులు సర్కారు కండ్లు కప్పి ప్రభుత్వానికి కట్టాల్సీన పన్నులు చెల్లించకుండానే ఇసుక వ్యాపారం చేస్తున్నట్లు తెలి సింది. అక్రమ ఇసుక వ్యాపారం చేస్తూ అందరి నోట్లో మట్టికొడుతున్న అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీ శ్రీ వినాయక లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తూ ఇసుక తరలిస్తున్న లారీలతో పాటు లారీ యజమానులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
చట్టపరమైన చర్యలు తీసుకోవాలి...
లక్షల రూపాయలు పన్నులు చెల్లించి నిబంధనల ప్రకారం ఇసుక వ్యాపారం చేసి చివరకు అప్పులపాలై అర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న లారీ యజమానులకు న్యాయం జరిగేలా ఇలాంటి అక్రమ ఇసుక రవాణా చేసే వారి పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించాలని శ్రీ శ్రీ వినాయక లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్.శ్రీను డిమాండ్ చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు దోమ మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులు మల్లారెడ్డి,కోశాధికారి బుచ్చిరెడ్డి,సలహ దారు రమేష్ కుమార్ గౌడ్,రవి తదితరులు పాల్గొన్నారు.