Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోకిరీల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం
- రాచకొండ కమిషనర్ డి.ఎస్. చౌహాన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
మహిళలను వేధించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, మహిళల భద్రతకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ డి.ఎస్.చౌహాన్ తెలిపారు. పోకిరీలు, ఆకతాయిల పట్ల చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. గురువారం షి టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు కౌన్సిలింగ్ నిర్వ హించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఆకతాయిలు, పోకిరీల ఆగడాలను అరికట్టడంతోపాటు గృహ హింస, పని ప్రదేశాల్లో మహిళలు, అమ్మాయిలను వేధించే వారి నుంచి బాధితులను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. రాచకొండ పోలీసుల నేతృత్వంలో మహిళల భద్రతకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుం టున్నామని తెలిపారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులు, ప్రయాణ సమయాల్లో వేధింపుల వంటి ఇబ్బందుల నుంచి వారిని రక్షించేందుకు రాచకొండ పోలీసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటున్నారని స్పష్టం చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఆడపిల్లల భద్రత కోసం ప్రత్యేకంగా షి టీమ్స్ పనిచేస్తున్నాయన్నారు. ఆకతాయిల ఆటకట్టించి బాధితులకు భరోసా నిలుస్తున్నాయన్నారు. పట్టుబడిన ఆకతాయిలకు కౌన్సిలింగ్ ద్వారా వారి చెడు ప్రవర్తనను మార్చుకునే విధంగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తిరిగి బాధ్యత గల పౌరు లుగా మారే అవకాశం కల్పిస్తున్నారన్నారు. మహిళలను గౌరవిం చడం తమ వ్యక్తిత్వంలో భాగం కావాలని పురుషుల నుద్ధేశించి కోరారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గడిచిన రెండు నెలల కాలంలో షీ బృందాలు ఈవ్ టీజర్లపై 118 కేసులు నమోదు చేయగా 247 మంది ఆకతాయిలను అరెస్టు చేశారన్నారు. వాటిలో 33 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా, 41 పెట్టీ కేసులు నమోదు చేశారన్నారు. మిగిలిన వారికి కౌన్సిలింగ్ అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు బాల, డీ.శ్రీనివాస్, సాయి శ్రీ, ఏసీపీ శ్రీధర్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.