Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ సంఘాల జేఏసీ
- 'చలో అసెంబ్లీ' ఉద్రిక్తం, నాయకుల అరెస్టు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆటో డ్రైవర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించకుంటే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ జేఏసీ హెచ్చరించింది. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ ఆఫీస్ సత్యనారాయణ రెడ్డి భవన్ నుంచి ఆటో డ్రైవర్స్ సంఘాల జేఏసీ వందలాది మందితో 'చలో అసెంబ్లీ' చేపట్టింది. వ్యూహాత్మకంగా పోలీసుల నిర్బంధాన్ని అధిగమించి సత్యనారాయణ రెడ్డి భవన్ నుంచి ఒక్కసారిగా ఆటో డ్రైవర్లు హిమాయత్‌నగర్ ప్రధాన రహదారిపై ప్రభుత్వానికి వ్యతరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శనగా దూసుకొచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అప్రమత్తమైయ్యే లోపు పోలీసుల బారికేడ్ల తోసుకుంటూ అసెంబ్లీ వైపు పరుగులు తీశారు. కొద్దిదూరంలో పోలీసులు వారిని అరెస్టు చేసి చిక్కడపల్లి స్టేషన్‌కు తరలించారు. 'చలో అసెంబ్లీ' కార్యక్రమాన్ని నిరోధిం చేందుకు పొలీసు బలగాలు శుక్రవారం తెల్లవారుజామున తెలం గాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ సంఘాల జేఏసీ నేతలు ఎండీ. అమా నుల్లా ఖాన్ (తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్), కె.అజరు బాబు (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్-సీఐటీయూ) ఒమర్ ఖాన్, సీహెచ్. జంగయ్య (ఏఐటీయూసీ) జి.మల్లేష్ గౌడ్ (ఐఎన్టీయూసీ), వి.కిరణ్(ఐఎఫ్టీయూ) నాయకుల ఇండ్లపై దాడిచేసి బలవంతంగా అరెస్ట్ చేశారు. 'చలో అసెంబ్లీ' ప్రదర్శనను ఉద్దేశిం చి రాష్ట్ర ఆటో డ్రైవర్స్ సంఘాల జేఏసీ కన్వీనర్, ఏఐటీయూసీ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వెం కటేశం మాట్లాడుతూ 2014 నుంచి నేటివరకు ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందన్నారు. ధర్నాలు, పోరాటాలు చేసిన చీమకుట్టినట్టు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు అడ్డుఅదుపు లేకుండా పెరగడం వల్ల రవాణా రంగా కార్మికుల జీవనం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిందన్నారు. పెరిగిన ఇంధన, నిత్యావసర ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలను మినిమం చార్జి రు.45, కిలోమీటర్‌కు రు.20కు వెంటనే పెంచాలన్నారు. సామాజిక భద్రత కోసం ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త ఆటో పర్మిట్లను జారీచేయాలనీ, పెరిగిన ఆటో ఇన్సూరెన్సు ధరలను తగ్గించాలన్నారు. ఏపీలో మాదిరిగా రాష్ట్రంలోనూ లైసెన్స్ కలిగిన ప్రతీ ఆటో కార్మికునికీ 'వాహన మిత్ర' ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగివచ్చి వెంటనే ఆటో రిక్షా కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక ఆందోళనలు చేస్తామని బి.వెంకటేశం హెచ్చరించారు. ఏఐటీయూసీ సీనియర్ నాయకులు వి.ఎస్. బోస్ మాట్లాడుతూ ఆటో రిక్షా కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం తాత్సారం చేయడం సిగ్గుచేటన్నారు. ఆటో డ్రైవర్ల బతుకులు దినదిన గండంగా మారాయనీ, వారి జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయన్నారు. త్వరగా సమస్యలు పరిష్కరించి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ.సత్తి రెడ్డి (ఆటో యూనియన్స్), ఎంఏ.సలీం, నజీర్ (తాడ్వా), ఆర్.మల్లేష్, కొమురవెల్లి బాబు, ఎస్కె లతీఫ్, ఏం. శ్రీనివాస్, యాదగిరి, ఫరూక్, అబ్బాస్, శ్యామ్ (ఏఐటీయూసీ), ఏం.అంబదాస్ (ఐఎన్టీయూసీ), ఎండీ.హబీబ్ (జీహెచ్ఏడీయూ) పాల్గొన్నారు.