Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆప్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ దిడ్డి సుధాకర్
- ట్యాంక్‌బండ్ వద్ద అమరవీరులకు నివాళి
నవతెలంగాణ-అడిక్‌మెట్/సిటీబ్యూరో
దేశ సరిహద్దు భద్రతతోపాటు ఉగ్రవాదాన్ని అరికట్టడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. భద్రతా సిబ్బందిపై వరుసగా దాడులు జరుగుతుంటే ప్రధాని మోడీ ''మూగ ప్రేక్షకుడిగా'' మిగిలిపోవడం సిగ్గు చేటన్నారు. నాలుగేండ్ల క్రితం ఇదే రోజు పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పో యిన 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బందిని స్మరించుకుంటూ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ ట్యాంక్ బండ్, యుద్ధ ట్యాంక్ వద్ద మంగళవారం కొవ్వత్తులు వెలిగించి పుల్వామా అమరవీరులకు నివాళ్లర్పించింది. ఈ సందర్బంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ మోడీ, అమిత్ షా అమర సైనికుల త్యాగాలను ఎన్నికల స్వప్రయోజనాలకు మాత్రమే వాడుకుంటున్నారనీ, వారు దేశ భద్రత, శాంతి స్థిరత్వానికి సంబంధించినవి ఏవి పట్టించుకోరన్నారు. సాయుధ దళాలను రాజకీయం చేయడం ద్వారా దేశభక్తి తరంగాన్ని సాధారణ ఎన్నికలలో ఉపయోగించి మూడోసారి అధికారంలోకి రావడానికి చేసే మోడీ ప్రయత్నాలను తిప్పికొడతామన్నారు. కాశ్మీర్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టడంలో మోదీ ఘోర వైఫల్యం దేశంలోని అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. సైనిక అమరవీరుల త్యాగాలను బీజేపీ రాజకీయం చేస్తే ఉరుకునేదిలేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆప్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు రాములు గౌడ్, శోభన్ భూక్యా, నేతలు డా.హరి చరణ్, టి.రాకేష్ సింగ్, ఆఫ్జాల్, మొహమ్మద్ మజీద్, జైసింగ్, అల్లాఉద్దీన్, సయ్యిద్ సలావుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.