Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి
- పొఫెసర్ నాగేశ్వర్
నవతెలంగాణ-ముషీరాబాద్
దేశంలో భగత్ సింగ్ స్ఫూర్తితో యువత కదలాలని డీవైఎఫ్ఐ మాజీ నాయకులు, ప్రొఫెసర్ నాగేశ్వర్ పిలుపునిచ్చారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డీవైఎఫ్ఐ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో తాజా, మాజీ డివైఎఫ్ఐ నాయకుల ఆత్మీయ సమావేశాన్ని నగర కార్యదర్శి ఎండీ జావేద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఇచ్చిన మాట్లాడే స్వేచ్ఛని ప్రశ్నించే తత్వాన్ని ఈరోజు పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారని, సుప్రీంకోర్టును సైతం ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నా మన్నారు. సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడానికి కూడా జీర్ణించుకోలేకుండా తట్టుకోలేకుండా ఉన్న పరిస్థితిని మనం గమనిస్తామని, ఇలాంటి పరిస్థితులలో యువత భగత్ సింగ్ ఇచ్చిన విలువలను, పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయేలా ప్రయత్నించాల్సిన అవసరాన్ని నేటి యువతకు అందించాల్సిన అవసరాన్ని ఉందని వివరించారు. భగత్‌సింగ్ ఎందుకోసమైతే త్యాగం చేశారో ఆ త్యాగం విలువలు ఆ త్యాగపు వారసత్వం నేడు కనుమరుగు చేయాలని కొంతమంది పాలకులు కుట్రలు పన్నుతున్న పరిస్థితి చూస్తున్నామన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా భగత్‌సింగ్ పోరాటం చేశాడని, ఆ మతోన్మాదాన్ని ఇప్పుడు ఈ దేశం మీద రుద్దాలని పాలకులు ప్రయత్నిస్తున్న పరిస్థితి చూస్తున్నామని చెప్పారు. కాబట్టి వీటిని ఎదిరించే చైతన్యాన్ని నేటి యువతకు అందించే కర్తవ్యాన్ని డీవైఎఫ్ఐ యువత బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే డ్రగ్స్ వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. భగత్ సింగ్ వర్ధంతిని పెద్ద ఎత్తున హైదరాబాద్‌లో నిర్వహించాలని, అందులో ప్రతి ఒక్క యువకుడు, విద్యార్థి పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ హైదరాబాద్ నగర మాజీ నాయకులు పార్థసారథి అంజయ్య, జెకె శ్రీనివాస్, హరి, శ్రీనివాస, శ్రీనివాసరావు, ఎం.మారన్న, విజరు కుమార్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కార్యదర్శి అనగంటి వెంకటేష్, డీవైఎఫ్ఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి విజరు కుమార్, జావేద్ శతి మేడ్చల్ నాయకులు కిరణ్, నాగలక్ష్మి సుచిత్ర పాల్గొన్నారు.