Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-ముషీరాబాద్
శాసనమండలిలో ప్రశ్నించే గొంతులకే పట్టం కట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. భుజంగరావుకు ఉపాధ్యాయ సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉందన్నారు. మంగళవారం వీఎస్టీ ఫంక్షన్ హాల్లో స్టేట్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి బి.భుజంగరావు నామి నేషన్ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ ఎస్టీయూ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న భుజంగ రావుకు ఉపాధ్యాయ సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉందన్నా రు. ఉపాధ్యాయుల గొంతు శాసనమండలిలో ప్రతిధ్వనించాలంటే ఆయనను గెలిపించాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. సమస్యలపై నిర్భయంగా, నిక్కచ్చిగా ప్రశ్నించే ధైర్య సాహసాలు కలిగిన భుజంగరావును గెలిపిస్తే శాసనమండలిలో ఉపాధ్యా యుల సమస్యలపై పోరాడి పరిష్కారానికి కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరుగు తున్న ఎన్నికల్లో ఎస్టీయూ ఉమ్మడి ఉపాధ్యాయ, అధ్యాపకుల సంఘాల అభ్యర్ధిగా బి.భుజంగరావు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. భుజంగరావు అభ్యర్థిత్వానికి మద్దతుగా బాగ్ లింగంపల్లి వీఎస్టి ఫంక్షన్ హాల్లో ఎస్టీయూ టీఎస్ అధ్యక్షుడు జి.సదానందం గౌడ్ అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ఈ సభలో కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ విద్యారంగంపై సంపూర్ణ అవగాహన ఉన్న భుజంగరావును టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించాలన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూనే సమాజ అభ్యున్నతి కోసం ఉపాధ్యాయులు పాటుపడతారనీ, కానీ వారి సమస్యలను పరిష్కరించుకోలేని పరిస్థితులు ఉన్నారన్నారు. గతంలో ఎస్టీయూ నుంచి మొట్టమొదటి సారిగా శాసనమండలికి వి.పి.రఘవాచారి ఎన్నికయ్యారని గుర్తు చేశారు. శ్యామ్ రావు, జయశంకర్, బాలాజీ, రామబ్రహ్మం లాంటి అనేక మంది మేధావు లను మండలికి పంపిన ఘనమైన చరిత్ర ఎస్టీయూకు ఉందన్నా రు. కేవలం ఉపాధ్యాయ సమస్యలే కాకుండా సమాజాన్ని పట్టిపీడిస్తున్న అనేక సమస్యల పరిష్కారానికి వారు ఎనలేని కృషి చేశారని చెప్పారు. తమ గళాన్ని మండలిలో వినిపించిన అనేక క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి భుజంగ రావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై జాక్టో ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామన్నారు. గతంలో శాసనమండలిలో ఎస్టీయూ తరపున గెలిచినవారే ఉపాధ్యాయుల హక్కులను, పెన్షన్ సాధించారన్నారు. ఉపాధ్యాయుల ఆత్మగౌరవ మే లక్షంగా ఉమ్మడి ఉపాధ్యాయ పోరాటాలు సాగించామన్నారు. స్థానికతకు పాతరేసి, 317 జీవో బాధితులను సొంత జిల్లాలకు తీసుకరావడానికి కృషి చేస్తానని చెప్పారు. సీపీఎస్ విధానం రద్దుకు, కేజీబీవీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ సమావేశంలో ఎస్టీయూ టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సదానందం గౌడ్, పర్వత్ రెడ్డి, తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు హేమ చంద్రుడు, ప్రధాన కార్యదర్శి సచ్చిదానంద రెడ్డి, గౌరవ అధ్యక్షులు మోహన్ రెడ్డి, టీపీటీయూ అధ్యక్షులు రాధా కృష్ణ, ప్రధాన కార్యదర్శి పి.చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షులు వేణుగోపాలస్వామి, తదితరులు పాల్గొన్నారు.