Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఇప్పటివరకు విస్మరణకు గురైన సాహిత్యాన్ని వెలికి తీసి సమాజంలోని అన్ని వర్గాల సాహిత్యానికి సమ ప్రాధాన్యం కల్పించేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ కృషి చేస్తుందని అకాడమీ చెర్మెన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. గురువారం రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో చింతకింద శివశంకర్ కవిత్వ సంకలనం ''విషనరుడు'' పుస్తకాన్ని ప్రొఫెసర్ సి. కాసీం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, సాలెల మగ్గం, శరీరకష్టం స్ఫురింపజేసే సమస్త వృత్తి కళల సాహిత్యాన్ని వెలికి తీసి సాహిత్య వేదిక మీద నిలబెట్టాల్సిన బాధ్యతను చేపట్టి కొనసాగిస్తామని తెలిపారు. సమాజాన్ని ముక్కలుగా విభేజించే సాహిత్యం కాకుండా ఐక్యతను చాటిచెప్పే సాహిత్య సృష్టికి కొత్త కలాలు కదలి రావాలని పిలుపునిచ్చారు. కవిత్వంలో క్లుప్తత, సంక్షిప్తత తెలిసిన చింతకింది శివశంకర్ ఏ వస్తువునైనా ఎట్లా కవిత్వీకరించాలో కవిత్వం రహస్యం తెలిసిన కవి అని, వర్తమాన కవుల కంటే భిన్నంగా ఆలోచించడమే ఈ కవి మనకు అందించిన ''విషనరుడు'' కవితా సంపుటి అని ప్రొఫెసర్ కాశీం అన్నారు. సభాధ్యక్షుడు షేక్ సలీం, పుస్తక సమీక్షకుడు గుడిపల్లి నిరంజన్, వక్తలు మెర్సీ మార్గరెట్, కోయ చంద్రమోహన్, ఆడెపు శ్రీనివాసులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.