Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-బంజారాహిల్స్
తెలుగు సంస్కతి సంప్రదాయాలను కళలను పరిరక్షిస్తూ ప్రభుత్వానికి కళాకారులకు వారధిగా వ్యవహరిస్తున్న కళ 10వ వార్షికోత్సవ సందర్భం, ఎన్టీఆర్ ఘంటసాల శత జయంతి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 25 న దుబాయ్ లో శత వసంత కళా వైభవం నిర్వహిస్తున్నట్టు ఉత్సవాల కమిటీ చైర్మన్ డాక్టర్ మహ్మద్ రఫీ తెలిపారు. కేంద్ర సాంస్కతిక శాఖ, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్, దుబాయ్ తెలంగాణ సొసైటీ సహకారం తో సెల్ హెల్త్, భువనేశ్వరి గ్రూప్ సౌజన్యం తో కళ, కలయిక ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుక లు జరుగనున్నాయని వివరించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమా వేశంలో కలయిక ఫౌండేషన్ చైర్మన్ చేరాల నారా యణ, సీనియర్ పాత్రికేయులు జి.భగీరధ, మహ్మద్ షరీఫ్, ఇంటూరు హరికృష్ణతో కలసి డాక్టర్ మహ్మద్ రఫీ ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. నందమూరి తారక రామారావు, ఘంటసాల వెంకటేశ్వరరావు లకు అంకితం చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి వంద మంది కళాకారులు పాల్గొని పలు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అంతర్జాతీయ ఎన్టీఆర్ శతాబ్ది కళా పురస్కారం నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, అంతర్జాతీయ ఘంటసాల శతాబ్ది కళా పురస్కారాలు ఘంటసాల కోడలు కలైమామణి ఘంటసాల పార్వతి రవి (చెన్నై ), ప్రముఖ గాయకుడు చంద్రతేజ (హైదరాబాద్) స్వీకరించనున్నారు. స్వాతి సంపాదకులు వేమూరి బలరామ్ను ఎన్టీఆర్ ఘంటసాల అంతర్జాతీయ జీవన సాఫల్య పురస్కారం, రూ.ఐదు లక్షల నగదుతో సన్మానించునున్నారు. ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డులతో వివిధ రంగాలలో విశేష సేవలను అందిస్తున్న ప్రముఖులను సత్కరించ నున్నారు. పాత్రికేయులు భగీరధ రచించిన మహా నాయకుడు ఎన్టీఆర్, మన ఘంటసాల పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్లకు సంఘీభావంగా ఐ స్టాండ్ ఫర్ వారియర్స్ నినాదం టేక్ ఎ బౌ టు వారియర్స్ ప్రచార చిత్రాన్ని ఈ వేడుకలలో ప్రత్యేకంగా ఆవిష్కరించనున్నారు. అంతర్జా తీయ కళా పురస్కారాల కోసం సంఘ సేవకులు చింతా రవికుమార్, రెడ్డి ఆనంద నరసింహ స్వామి, కోసూరు రత్నం, డాక్టర్ మురళీ మోహన్, డాక్టర్ సానియా రియాజ్ తదితరులను ఎంపిక చేశారు. ఈ వేడుకలో తెలంగాణ ముఖ్య ఎన్నికల కమిషనర్ సి.పార్ధసారధి, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, బహ్రెయిన్ దేశ యువరాణి జవహర్ బింట్ షేక్ ఖలీఫా, ఇండియన్ కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పురి, తదితరులు పాల్గొంటున్నారని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు.