Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ నాయకులు
నవతెలంగాణ-కాప్రా
చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న కాంట్రాక్టు వలస కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న కాంట్రాక్టు వలస కార్మికుల సమస్యలపై శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో సర్వే నిర్వహిం చారు. ఈ సర్వేలో కాంట్రాక్టు వలస కార్మికులు అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని నాయకుల దృష్టికి తీసుకొని వచ్చారు. కార్మికులతో కొంతమంది యజమానులు వెట్టిచాకిరి చేయిస్తున్నారని, కంపెనీలలో షెడ్లు నిర్మించి అందులో పశువుల మాదిరిగా ఒక్కో రూములో 10 నుండి 15 మందిని ఉంచుతున్నారని తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించడం లేదని ఈఎస్ఐ, పీఎఫ్ ,బోనస్, లీవ్స్ లాంటి సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. అదేవిధంగా ప్రమాదాలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా నామమాత్రపు ప్రథమ చికిత్స చేయించి వదిలించుకుంటున్నారని వలస కార్మికులు తెలియజేశారు. అదే విధంగా రాత్రిపూట షిఫ్ట్ ముగించుకుని ఇంటికి వస్తున్నప్పుడు పోలీసుల నుంచి ఇతరుల నుండి అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలియజేశారు. ఎలాంటి గుర్తింపు కార్డులు ఇవ్వకుండా పనిచేయించుకుంటున్నందున మమ్ములను దొంగలుగాను ఇతర అరాచకవాదులుగా చూస్తున్న పరిస్థితి ఉందని తెలిపారు. కంపెనీ యజమానులు పని చేయించుకుని సక్రమంగా వేతనాలు ఇవ్వకుండా దిక్కున చోట చెప్పుకోమని వెళ్లగొడుతున్న పరిస్థితి కొంతమంది యజమానుల దగ్గర ఉందని తెలిపారు. బీహార్ ,ఉత్తరప్రదేశ్, ఝార్ఖాండ్, ఒరిస్సా ,ఛత్తీస్గఢ్, బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం కుటుంబాలను వదులుకొని ఇక్కడికి వచ్చి పని చేస్తూ జీవిస్తున్నామని తమకు ఎలాంటి సౌకర్యాలు ఎవరూ కల్పించడం లేదని చెప్పారు.
ఈ సందర్భంగా సీఐటీయూ మేడ్చల్ జిల్లా కార్యదర్శి జే. చంద్రశేఖర్ సహాయ కార్యదర్శి జి. శ్రీనివాసులు మాట్లాడుతూ 1979 అంతరాష్ట్ర వలస కార్మికుల చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆ విధంగా అమలు చేయని వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈఎస్, పీఎఫ్, బోనస్, లీవ్స్ లాంటి కనీస సౌకర్యాలు కాంట్రాక్టు వలస కార్మికులకు కూడా ఇవ్వాలని కోరారు. అదేవిధంగా ఆయా కంపెనీలు కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కావున పై సమస్యల పరిష్కారం కోసం మార్చి ఒకటో తేదీన మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద కాంట్రాక్టు వలస కార్మికులతో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.