Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానికంగా సింథెటిక్ డ్రగ్స్ తయారీ
- పాడుబడ్డ కర్మాగారాల్లో దందా
- చెక్ పెడుతున్న హైదరాబాద్ నార్కొటెక్ ఎన్ఫోర్సుమెంట్ వింగ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశవ్యాప్తంగా మత్తు పదార్థాల వాడకం.. డ్రగ్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోనూ మత్తు పదార్థాల రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎక్కువగా ఆర్థికంగా ఉన్నత వర్గాలు.. సెలబ్రెటీల పిల్లలు మత్తు పదార్థాలకు ఎక్కువగా బానిసలుగా మారుతున్నారు. దాంతో మత్తు పదార్థాల వాడకం, యువత తప్పుదోవ పడుతున్న వైనంపై పెద్ద ఎత్తున చర్చ జరుగు తోంది. ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ కు అలవాటుపడిన యువత తరచూ నేరాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుం టున్నాయి. డ్రగ్స్, గంజాయి వినియోగం పెరుగుతున్నట్టు పోలీ సులు గుర్తించారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ప్రత్యేకం గా ఏర్పాటు చేసిన హైదరాబాద్ నార్కొటెక్ ఎన్ఫోర్సుమెంట్ వింగ్ వీటికి చెక్‌పెడుతున్నారు. అయితే నగరంలో డ్రగ్స్ విక్రయదారులు, సరఫరా దారులు, డీలర్లపై ప్రత్యేక నిఘాపెట్టడంతో స్మగ్లర్లు రూటు మార్చారు. పాడుపబడ్డ కార్మాగారాలు, జనసంచారం లేని ప్రాంతాలు, ల్యాబ్‌లో మెటమైసిన్ సింథెటిక్ డ్రగ్స్, ఎండీఎంఏ డ్రగ్స్‌ను తయారు చేస్తూ సరఫరా చేస్తున్నారు. ఇదే తరహాలో ఇటీవల ముంబయి నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలిస్తున్న మూడు మూఠాలను పోలీసులు అరెస్టు చేశారు. దాంతో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. మత్తులో ఉంచి అమ్మాయిలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నట్టు తెలిసింది.
ముంబయి నుంచి హైదరాబాద్
మహారాష్ట్రాకు చెందిన డ్రగ్స్ సప్లయర్ వికాస్ మోహన్ కోడ్మూర్ అలియాజ్ విక్కీ, జునైద్ షేక్న షంషుద్దీన్, జతిన్ బాలచంద్ర భలేరావు, జావేద్ షంషైర్ అలి సిద్దిక్‌లు ఒక ముఠాగా ఏర్పాడ్డారు. ఇదిలావుండగా బిల్కిస్ మొహ్మద్ సులేమాన్ షేక్, అలీయాస్గర్ సఫుద్దిన్ రాంపురవాలా, ముర్తుజా షేక్ అలియాజ్, మెహ్రాజ్, షైబాజ్తోపాటు మరో ముఠా సభ్యలు దేశవ్యాప్తంగా డ్రగ్స్ దందాను కొనసాగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏజెంట్లను, కంజూ మర్లను ఏర్పాటు చేసుకుని అధిక ధరలకు గంజాయి, డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. అయితే నగరంలో పోలీసుల నిఘా అధికం కావడంతో ఎవరూ గుర్తించకుండా స్థానికంగా ఉన్న కర్మాగారాలు, మూతపడ్డ ల్యాబ్‌ల్లో అల్ప్రాజోలం, ఎండీఎఏ, మెటమైన్ తదితర డ్రగ్స్‌ను తయారు చేస్తున్నారు. వాటిని గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో నగరంలో మూడుముఠాలను అరెస్టు చేశారు. వారి నుంచి నుంచి 110 కిలో గంజాయితోపాటు 244 గ్రాముల ఎండీఎఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
16గంటల వరకు మత్తు... లైంగికదాడులు
సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో స్మగ్లర్లు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా గోవా, ముంబయి తదితర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేసి యువతీయువకులకు మాదక ద్రవ్యాలను అలవాటు చేస్తున్నారు. కొన్ని డ్రగ్స్ 12 నుంచి 16 గంటల వరకు మత్తులో ఉంచుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని ముఠాలు యువతులను డ్రగ్స్‌కు, గంజాయికి బానిసలుగా చేసి మత్తులో ఉన్న సమయంలో వారిపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు.
ఎంతిటివారైనా వదిలే ప్రసక్తే లేదు...
నగరంలో డ్రగ్స్ నివారణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ మూలాలపై ఆరా తీస్తున్నామని, ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ నార్కొటెక్ ఎన్ఫోర్సుమెంట్ వింగ్ (హెచ్‌న్యూ) ఏర్పాటు చేశామన్నారు. ఈ వింగ్ ఏడాది కాలంలోనే 105కేసులు నమోదు చేశాయన్నారు. అందులో 15 మంది వరకు విదేశీ స్మగ్లర్లు, 200లకుపైగా సప్లరుదారులతోపాటు 1100 మంది వినియోగ దారులను అరెస్టు చేశామన్నారు. ఐవరీకోస్టు, నైజీరియా, సుడాన్ దేశాలకు చెందిన వారిని సైతం అరెస్టు చేశారు. ముంబయిలో డ్రగ్స్ డాన్లతోపాటు డ్రగ్స్ కొనుగోలు దారులు, సరఫరా దారులే కాకుండా వినియోగ దారులను గుర్తించామని తెలిపారు. త్వరలో వారిని అదుపులోకి తీసుకుంటామన్నారు. ముంబయి పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారని వారి సహకారంతో డ్రగ్స్ సరఫరాను అడ్డుకుంటామని సీపీ తెలిపారు.