Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లైంగిక వేధింపులపై అవగాహన కార్యక్రమంలో అదనపు డీసీపీ నర్మద
నవతెలంగాణ-సిటీబ్యూరో
మహిళలు, అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురికా కుండా అప్రమత్తంగా ఉండాలని అదనపు డీసీపీ నర్మద తెలిపారు. మహిళలను మాటల ద్వారా, చేతల ద్వారా, మరే ఇతర మార్గాల ద్వారా అయినా లైంగికంగా వేధించే వారి పట్ల చట్ట పరిధిలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నుంచి రక్షణ, వాటిని ఎలా నివారించాలో అవుట్ సోర్సింగ్ మహిళా సిబ్బందికి శుక్రవారం రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ విమెన్స్ ఫోరమ్, ఇన్ఫోసిస్ సంయుక్త కార్యదర్శి లతా రామ్ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో పని ప్రదేశాల్లో మహిళలకు ఎదురయ్యే వివిధ రకాల వేధింపుల మీద ఫిర్యాదు చేసే విధానాన్ని వక్తలు వివరించారు. వేధింపులు జరిగిన మూడు నెలల లోపు వరకూ బాధితురాలు ఫిర్యాదు చేసే వీలుందన్నారు. బాధితురాలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని అదనపు డీసీపీ తెలిపారు. ఒక వేళ స్వయంగా ఫిర్యాదు చేయలేని స్థితిలో వారి కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూమిక కలెక్టివ్ స్థాపకురాలు కే.సత్యవతి, ఆర్కేఎస్సీ చీఫ్ కోఆర్డినేటర్ సావిత్రితోపాటు సీసీఎంబీ, సీఐపీఈటీ, ఐఐసీటీ, బీపీసీఎల్, రామోజీగ్రూప్స్, ఇన్ఫోసీస్, జెన్‌ప్యాక్, అమెజాన్‌తోపాటు తదితర కంపెనీల నుంచి దాదాపు వెయ్యి మంది పాల్గొన్నారు.