Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనవరి నుంచి ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం
- నిలిపేయడానికి కారణాలు తెలియదంటున్న సంబంధిత అధికారులు
వెంటనే ఇవ్వాలని ప్రజల వేడుకోలు
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయికి కిలో బియ్యం, ఒక్క మనిషికి 6 కిలోలు ఇస్తున్న బియ్యాన్ని పౌరసరఫరాల ద్వారా నిలిపివేశారు. ఖైరతాబాద్ సర్కిల్ సెవెన్ పరిధిలో 81 రేషన్ షాపులు ఉన్నాయి. ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం సరఫరా కావడం లేదు. ఈ విషయమై అధికా రులను వివరణ కోరగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిలిపేసిందో తమకు కూడా తెలియటం లేదని చెప్పడం గమనార్హం. డీలర్లకు ఒక కేజీ బియ్యానికి 70 పైసలు కమిషన్ మాత్రమే ఇస్తున్నారు. అవి సరిపోక డీలర్లు అడ్డదారులలో బియ్యాన్ని అమ్ముకుంటు న్నారు. కేంద్ర ప్రభుత్వం మనిషికి 5 కిలోలు ఉచితంగా ఇచ్చే దొడ్డు బియ్యం మాత్రమే డీలర్ల వద్దకు చేరాయి. వాటిని కార్డు దారులకు ఇస్తున్నారు. ప్రతి రేషన్ షాపులో మోడీ ఫోటో పెట్టి కార్డుదారులకు అందిస్తున్నారు. అయితే రేషన్ కార్డుదారులకు ఇస్తున్న బియ్యం కేంద్రం ఇస్తుందో? రాష్ట్రం ఇస్తుందో కూడా ప్రజలకు తెలియని పరిస్థితి ఉంది. కొంతమంది డీలర్లు మాత్రం ఇప్పుడు ఇస్తున్న బియ్యం కేంద్రం ఉచితంగా ఇస్తుందనీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి బియ్యం రావడం లేదు అని బహిరంగంగానే చెబుతున్నారు. రేషన్ కార్డు ఉన్నవారు ఇచ్చిన బియ్యం తీసుకుని వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒక్కొక్కరికి ఐదు కిలోలు ఉచితంగా పంపిణీ చేయడానికి నిర్ణయించింది. ఈ ఏడాది మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యం మాత్రమే ఇస్తారా? లేక రాష్ట్ర ప్రభుత్వం కూడా కిలో రూపాయి చొప్పున ఒక్క మనిషికి ఆరు కిలోలు ఎప్పుడు ఇస్తుందో తెలియని పరిస్థితి ఉంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ఇవ్వటం లేదని కార్డు ఉన్నవారికి తెలియట్లేదు.. నాయకులకు కూడా తెలియదు. అందరూ అయోమయంలో ఉన్నారు. ఒకపక్క ప్రతిపక్షం నాయకులు రేషన్ షాపులలో సన్న బియ్యం ఇవ్వాలని సీఎంపై ఒత్తిడి తెస్తున్నారు. సన్న బియ్యం ఇవ్వలేక, ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని కూడా నిలిపివేశారు అని ప్రజలు మండిపడుతున్నారు. దొడ్డు బియ్యాన్ని 50శాతం మంది కార్డుదారులు డీలర్ల వద్ద బియ్యం తీసుకోవడం లేదు. దానికి బదులుగా కేజీకి రూ.10 చొప్పున డబ్బులు తీసుకుంటున్నారు. కొంతమంది డీలర్లు బహిర ంగంగానే బియ్యం కావాలా? డబ్బులు కావాలా? అని అడిగి మరీ ఇస్తున్నారు. ఇదంతా అధికారులు, నాయకులకు తెలుసు. అయి నా పట్టించుకోవడం లేదు. డీలర్లు వారి వద్ద నిల్వ ఉన్న బియ్యాన్ని రూ.15కు బ్లాక్ మార్కెట్లో చీకటి దందా చేస్తూ అమ్ముతున్నారు. బియ్యం కొన్న దళారులు కొన్ని ప్రాంతాలు, చీకటి ప్రదేశాల్లో గోడౌన్లు ఏర్పాటు చేసుకుని సేకరించిన బియ్యాన్ని ఒకేసారి లారీలకు లోడ్ చేసి మిల్లులకు తరలిస్తున్నారు. అనేక సందర్భాల్లో మిల్లులకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకుని కేసులు పెట్టిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. వెంటనే కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వం అయినా సన్న బియ్యం కార్డుదా రులకు ఇవ్వాలనీ, అందరూ తినేలా బియ్యం ఉండాలని కోరుతున్నారు.
వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ఇవ్వాలి
రేషన్ షాపులలో వెంటనే రాష్ట్ర ప్రభు త్వం వాటా బియ్యం ఇవ్వాలి. కేంద్ర ప్రభు త్వం ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలి. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని ఈ ఏడాది జనవరి నుంచి ఎందు కు ఇవ్వటం లేదు అనే విషయాన్ని బహి రంగంగా సీఎం కేసీఆర్ తెలియజే యాలి. లేదంటే కార్డు గల మహిళలతో అన్ని రేషన్ షాపుల వద్ద నిరసనలు తెలుపుతాం. మహిళలతో కలిసి ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం. అందరూ తినే సన్న బియ్యం ఇవ్వాలి.
- సర్కిల్ 7 విజిలెన్స్ కమిటీ మెంబర్, ప్రజా సంఘాల నాయకులు సాయి శేషగిరిరావు