Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర
నవతెలంగాణ-కాప్రా
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి మృతికి కారణమైన తోటి మెడికో సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం ఈసీఐఎల్‌లోని అంబేద్కర్ కూడలి వద్ద ర్యాగింగ్‌కు పాల్పడిన సైఫ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర మాట్లాడుతూ ఐదురోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటూ ఆదివారం మృతి చెందినట్లు ఆస్పత్రివర్గాలు ప్రకటించాయని, ప్రీతిని కాపాడేందుకు ప్రత్యేక వైద్య బృందం అన్నివిధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్ల పట్ల సీనియర్లు స్నేహ భావంతో మెలగాలే తప్ప, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వారు అన్నారు. ఇప్పటికే ర్యాగింగ్‌ల పట్ల అనేక రూపాలుగా విద్యార్థి, యువతకు అవగాహన కల్పిస్తున్నా కొంతమంది తోటి విద్యార్థినుల పట్ల కనబరుస్తున్న తీరు సిగ్గుచేటని వారు అన్నారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో వైద్య కళాశాలల్లో ర్యాగింగ్లు పెరిగాయని, జూనియర్లపై సీనియర్ల ఆగడాలు అధికామయ్యాయని, వీటిని కట్టడి చేయాల్సిన కళాశాలలు, అధ్యాపకులు అలసత్వం వహిస్తున్నారని వారు ధ్వజమెత్తారు. కళాశాలలలో విద్యార్థినుల భద్రత కరువైందని, మార్కులతో ముడిపడి వున్న ప్రస్తుత విద్యా విధానం కారణంగా ప్రిన్సిపాల్, హెచ్ఓడీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ధ్వజమెత్తారు. ప్రీతి ఫిర్యాదు ను నిర్లక్ష్యం చేసిన కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, హెచ్ఓడీలను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు టి.సత్య ప్రసాద్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఉపాధ్యక్షుడు ఏడే. సతీష్‌కుమార్, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు కాసర్ల నాగరాజు, అబ్దుల్ ఘని, సుజాత, ఏఐఎస్ఎఫ్ నేతలు రవి, కుమార్, సందీప్, అంకుష్, శైలజ, దీప్తి, కుముదిని, గీత తదితరులు పాల్గొన్నారు.