Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి
- మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా పరీక్షా కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించాలని జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి జిల్లా ఇంటర్మీడియట్ అధికారి (డీఐవో) కిషన్, జిల్లా విద్యాశాఖ అధికారిణి (డీఈవో) విజయకుమారి, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందితో ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతాయని, ఈ పరీక్షల నిర్వహణలో అధికారులు సమన్వయంతో తమ విధులు నిర్వహించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 133 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, అందులో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్తు సరఫరా, లైటింగ్, ఫ్యాన్లు, తాగునీటి వసతి, వాష్ రూమ్‌లు అన్నీ ఉండేలా చూడాలని, ఈ విషయంలో ముందస్తుగానే ఏర్పాట్లు చేయాలని, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ సమావేశంలో సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ప్రథమ సంవత్సరంలో జనరల్ 62,342 మంది విద్యార్థులు, ఒకేషనల్ కోర్సులో 1,452 మంది మొత్తం 63,794 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జనరల్‌లో 54,146 మంది, ఒకేషన్ కోర్సులో 995 విద్యార్థులు, మొత్తం 55.141 పరీక్షలు రాస్తారని వివరించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా జనరల్‌లో 1,16,488 మంది, ఒకేషనల్ కోర్సులో 2,447 మంది విద్యార్థులు మొత్తం 1,18,935 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని లింగ్యానాయక్ వివరించారు. పరీక్షల కేంద్రాల వద్ద అన్నిరకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కిషన్, జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి, సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.