Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఏడుగురు నిందితుల అరెస్టు
- నకిలీ సర్టిఫికెట్లు, 4 ల్యాప్‌టాప్‌లు, స్టాప్స్, రూ.20వేల నగదు స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఏడుగురు నిందితులను సౌత్‌జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు, ఛాదర్‌ఘాట్ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ సర్టిఫికెట్లు, 4 ల్యాప్‌టాప్‌లు, స్టాప్స్, రూ.20వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం డీసీపీ చక్రవర్తి వివరాల ప్రకారం మలక్‌పేట్‌కు చెందిన మహ్మాద్ హబీబ్, చిలకలగుడాకు చెందిన అబ్దుల్ రావూఫ్, సంతోష్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఇర్ఫాన్, ఈద్‌బజార్‌కు చెందిన షాన్వాజ్ఖాన్, నాంపల్లికి చెందిన ఎండీ జుబేర్, మల్లపల్లికి చెందిన సల్మాన్ ఖాన్, మలక్‌పేట్‌కు చెందిన ఎండీ అబ్దుల్ సత్తార్లు ముఠాగా ఏర్పాడ్డారు. పలు ప్రాంతాల్లో కన్సల్టెన్సీలను ఏర్పాటు చేశారు. ఎడ్యుకేషనల్ మార్కెటింగ్ చేసే ఢిల్లీకి చెందిన సునీల్ కపూర్‌తో చేతులు కలిపారు. అతని సాయంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని యూనివర్శిటీలు, స్కూల్స్, కాలేజీలకు చెందిన సర్టిఫికెట్లను నకిలీ చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్ఎస్సీతోపాటు ఇంటర్, డిగ్రీ, పీజీ తదితర సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారు. యూకే, యూఎస్ఏతోపాటు తదితర దేశాలకు వెళ్లేవారికి, పీజీ చేసే అభ్యర్థులకు వాటిని విక్రయిస్తున్నారు. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.50వేల నుంచి లక్షల్లో వసూళ్లు చేస్తున్నారు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛాదర్‌ఘాట్ పోలీసులతో కలిసి నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ఢిల్లీకి చెందిన సునీల్ కపూర్ కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర, ఎస్ఐలు షేక్ బురాన్, ఎన్.శ్రీశైలం, వీ.నరేందర్, కే.నర్సింములు, బీ.క్రిష్ణా, తదితరులు పాల్గొన్నారు.