Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓటీపీ మోసాలను మించుతున్న పార్ట్‌టైమ్ జాబ్ ఫ్రాడ్స్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఓటీపీ మోసాల కంటే పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో జరుగుతున్న మోసాలు రోజు రోజుకు అధికమవుతున్నాయి. మీరు ఎంత సేపు పనిచేస్తే అంత డబ్బు సంపాదించవచ్చని నమ్మిస్తున్నారు. ఇక్కడ కేవలం మీకు యాప్‌లో వచ్చే వస్తువులను కొంటున్నట్లు క్లిక్ చేయాలి, ఎన్ని క్లిక్‌లు చేస్తే అంత డబ్బు మీకు వస్తుందని గాలం వేస్తున్నారు. తీరా మోసపోయాక తేరుకుంటున్న బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలా హైదరాబాద్, రాచకొండ జంట పోలీస్ కమిషనరేట్ల పరిధిలో రోజుకు 10వరకు ఫిిర్యాదులు అందుతున్నాయి.
తాజాగా పార్ట్‌టైమ్ ట్రెండ్.. రుణయాప్‌లు కేసుల మాదిరిగా మరో భారీ సైబర్ కుంభకోణాన్ని సైబర్‌నేరగాళ్లు చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలలో ఓటీపీ (వన్‌టైమ్ పాస్వర్డ్) అనేది చాలాకీలకమైంది. వివిధ కారణాలు చెబుతూ సైబర్‌నేరగాళ్లు ఆ ఓటీపీలను తెలుసుకొని, బ్యాంకు ఖాతాలు కొల్లగొడుతున్నారు. రాజస్థాన్, యూపీ, జార్ఖాండ్, కోల్కత్త, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన సైబర్‌నేరగాళ్లు ఎక్కువగా ఇలాంటి మోసాలు చేస్తుంటారు. అయితే మనిషిలో ఉండే ఆశ, అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న సైబర్‌నేరగాళ్లు రోజుకో కొత్త తరహాలో నమ్మించి మోసాలు చేస్తున్నారు. ఇప్పుడు పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాల ట్రెండ్ నడుస్తోంది. కూర్చున్నచోటే సులువుగా డబ్బులు సంపాదించవచ్చని అత్యాశకు పోతున్న బాధితులు లక్షలు పోగొట్టుకుంటున్నారు.
ఒకటి రెండు గంటలు కష్టపడితే చాలు...
సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. చాలీచాలని వేతనంతో జీవనం సాగిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం అతని సెల్‌ఫోన్‌కు ఒక మేసేజ్ వచ్చింది. తాను ఫలాన కంపెనీ సీఈఓను అని, తమ కంపెనీలో పార్ట్‌టైమ్ ఉద్యోగ అవకాశాలున్నాయి, ఒకటి రెండు గంటలు కష్టపడితే రోజు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు సంపాదించుకునే అవకాశ ముందని మేసేజ్‌లో సారాంశముంది. మీకు కావాలంటే లింక్‌ను క్లిక్ చేయండని తెలిపారు. ఇదేదో బాగుందనుకున్న బాధితుడు ఆ లింక్‌ను క్లిక్ చేశాడు, అది ఒక వాట్సాప్ నెంబర్‌కు వెళ్లింది. పార్ట్ టైమ్ ఉద్యోగమంటే మీరు ఎంతసేపు పనిచేస్తే అంత డబ్బు సంపాదించవచ్చని సమాచారం ఇచ్చారు. ఇక్కడ కేవలం మీకు యాప్‌లో వచ్చే వస్తువులను కొంటున్నట్టు క్లిక్ చేయాలి. ఎన్ని క్లిక్‌లు చేస్తే అంత డబ్బు మీకు వస్తుంది. అయితే మీరు దానికి కొద్దిగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందంటూ అక్కడ ఒక మేసేజ్ వచ్చింది. మీకు నమ్మకం కుదురాలంటే మొదట వంద రూపాయలతో మొదలు పెట్టండి, మీకు నమ్మకం కుదిరాకే మరింత డబ్బులు పెట్టాలంటూ నమ్మించారు. అప్పుడే మీ పార్ట్‌టైమ్ ఉద్యోగం నడుస్తుందంటూ సూచించారు. దీంతో బాధితుడు ఆ లింక్‌ను క్లిక్ చేసి యాప్‌ను డౌన్లోడ్ చేశాడు. ఆ యాప్ ద్వారా మొదట వంద రూపాయలు పెట్టుబడి పెట్టాడు, అతడు పెట్టిన పెట్టుబడికి అమేజాన్‌లో ఉండే వస్తువుల మాదిరిగా యాప్‌లో స్క్రీన్‌పై కొన్ని వస్తువులు వచ్చాయి, వాటిని క్లిక్ చేస్తూ వెళ్లడంతో, యాప్‌లో స్క్రీన్‌పై కొద్ది నిమిషాల వ్యవధిలోనే వంద పెట్టుబడికి 100 శాతం లాభం కన్పించింది. మరుసటి రోజు రూ. 500 పెడితే దానికి డబుల్ ఇలా రోజు రెండు మూడుసార్లు పెట్టుబడి పెడుతూ వారం రోజుల పాటు పెట్టిన దానికి డబుల్ లాభం పొందాడు. మీరు మరింత పెట్టుబడి పెడితే స్కీమ్లున్నాయని, తరువాత డ్రా చేసుకోవచ్చని రకరకాల కారణాలు సూచిస్తూ దఫ దఫాలుగా పెట్టుబడి పెడుతూ రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. తీరా ఆ డబ్బులను డ్రా చేసుకునే అవకాశం లేకుండాపోయింది. మరింత పెట్టుబడి పెట్టాలంటూ సైబర్ నేరస్తులు చెప్పడంతో అనుమానం వచ్చిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశాడు. ఇలా నిత్యం పదుల సంఖ్యలో బాధితులు మోసాలకు గురవుతున్నారు.
అత్యాశకు పోవద్దు : సైబర్‌క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్
గుర్తు తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. డబ్బు ప్రస్తావన వస్తే అది మోసమని గుర్తించాలన్నారు. సెల్‌ఫోన్, వాట్సాప్, ఈమెయిల్స్‌కు వివిధ రకాల మేసేజ్‌లు సైబర్‌నేరగాళ్లు పంపిస్తుంటారని తెలిపారు. అందులో లింక్‌లను క్లిక్ చేయవద్దన్నారు. రోజంత కష్టపడితే రూ. 500 నుంచి వెయ్యి రూపాయలు సంపాదించడం కష్టమైన ఈ సమయంలో, నిమిషాల వ్యవధలోనే వేల రూపాయలు ఎవరిస్తారనే విషయాన్ని ఆలోచించాలన్నారు. ఆర్ధికపరమైన సైబర్ మోసాలలో గుర్తుతెలియని వ్యక్తులు డబ్బు ప్రస్తావన తెచ్చారంటే అది మోసమని గుర్తించాలన్నారు.