Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులతోపాటు ఎస్ఎన్డీపీ పనులను తనిఖీల్లో
- పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-సిటీబ్యూరో,అడిక్‌మెట్
సెంట్రల్ హైదరాబాద్ నగరానికి ప్రభుత్వం నిర్మిస్తున్న వీఎస్టీ-ఇందిరాపార్క్ స్టీల్ బ్రిడ్జి తలమానికంగా మారబోతున్నదని పురపాలకశాఖ మంత్రి కే.తారకరామారావు అన్నారు. శనివారం ఆయన స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులతోపాటు ఇతర అభివద్ధి కార్యక్రమాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఇందిరాపార్క్ వద్ద కొనసాగుతున్న స్టీల్ బ్రిడ్జి పనుల వరకు చేరుకున్న మంత్రి కేటీఆర్, స్టీల్ బ్రిడ్జ్ పురోగతిని జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్టీల్ బ్రిడ్జి పనుల పురోగతిని తెలుసుకున్న అనంతరం ఆయన పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. స్టీల్‌బ్రిడ్జ్ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో మూడు నెలలలోగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన ట్రాఫిక్ మళ్లింపు వంటి అంశాలలో నగర ట్రాఫిక్ పోలీస్ విభాగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితులలో మూడు నెలల్లోగా నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైతే అదనపు బందాలను ఏర్పాటు చేసి, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వర్కింగ్ ఏజెన్సీని కేటీఆర్ ఆదేశించారు. నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అటు కార్మికులకు, నగర పౌరులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కట్టుదిట్టమైన రక్షణ చర్యలను కూడా తీసుకోవాలని సూచించారు. నిర్మాణ పనులను పరిశీలించుకుంటూ వీఎస్టి చేరుకున్న మంత్రి కేటీఆర్ అక్కడ దాదాపుగా పూర్తయిన ర్యాంపు పైనుంచి బ్రిడ్జి నిర్మాణ పనులను పర్యవేక్షించారు.
ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పూర్తయిన ఎస్ఆర్డీపీ ఫ్లైఓవర్ల మాదిరి ఈ స్టీల్ బ్రిడ్జి అద్భుత నిర్మాణంగా మారబోతున్నదని అభిప్రాయ పడ్డారు. 2.62 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల స్టీల్ బ్రిడ్జి కోసం దాదాపు రూ.426కోట్ల నిధులను జీహెచ్ఎంసీ ఖర్చు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్ని తగ్గించి, ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్పేట్ వంటి నియోజక వర్గాల ప్రజల సౌకర్యార్థం ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలన్న డిమాండ్ రెండు దశాబ్దాలుగా ఉన్నదని, ఇంతటి కీలకమైన ఈ బ్రిడ్జి నిర్మాణం సత్వరంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే సాధారణ కాంక్రీట్ నిర్మాణం కాకుండా స్టీల్ బ్రిడ్జి మార్గంలో బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం రానున్న 3 నెలల్లో పూర్తి అవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్, ఆ తర్వాత లక్షలాదిమంది నగర పౌరులకు ట్రాఫిక్ రద్దీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు ఎస్ఎన్డీపీ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పలు మౌలిక సదుపాయాల కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. హుస్సేన్‌సాగర్ సర్ఫ్లస్ నాలాలో చేపడుతున్న పనులను సమీక్షించారు.
అశోక్‌నగర్ వద్ద కొనసాగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇప్పటికే ఎస్ఎన్డీపీి కార్యక్రమంలో భాగంగా వరద ముంపు ఉన్న ప్రాంతాలను గుర్తించి, వరద ప్రమాదాన్ని తగ్గించే విధంగా అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు కేటీఆర్ తెలిపారు. హుస్సేన్ సాగర్ వరద నీటి ద్వారా లోతట్టు ప్రాంతాల ప్రజలకు భవిష్యత్తులో ముంపు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలకు భారీ ఎత్తున నిధులు కేటాయించి రిటైనింగ్ వాల్ వంటి పనుల నిర్మాణం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలం ప్రారంభం నాటికి ఈ పనులన్నీ పూర్తి అయ్యేలా స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధుల సహకారంతో వేగంగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు.