Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
పికెట్ నాలాపై వంతెన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం మినిస్టర్ రోడ్డులో గల పికెట్ నాలాపై చేపట్టిన వంతెన నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బందిని మరింతగా పెంచి పనులు వేగంగా జరిగే విధంగా పర్యవేక్షణ జరపాలని చెప్పారు. ప్రతి ఏడాదీ వర్షాకాలంలో నాలాకు ఎగువ నుంచి వచ్చే నీరు సక్రమంగా వెళ్ళకపోవడం వల్ల పరిసర కాలనీలు ముంపు నకు గురై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నగరంలో ఉన్న అనేక నాలాల పరిధిలో ఇలాంటి పరిస్థి తులు ఉన్నాయని పేర్కొన్నారు. వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో పూర్తి స్థాయిలో నాలాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించి సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టినట్టు వివరించారు. అందులో భాగంగా కరాచీ బేకరీ వద్ద కూడా పికెట్ నాలాపై రూ.10 కోట్లతో నాలాలోని నీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా వెళ్ళిపోయే విధంగా నూతనంగా వంతెనను నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. మినిస్టర్ రోడ్డులో కూడా ఉన్న వంతెన శిథిలావస్థకు చేరడం, నీటి సరఫరా సక్రమంగా జరగక ముంపు సమస్య ఏర్పడుతుందని చెప్పారు. సమస్య పరిష్కారం కోసం పాత వంతెనను తొలగించి గతంలో ఉన్న దానికంటే ఎత్తులో వాహనాల రాలపోకలు సులువులుగా సాగేలా వెడల్పుగా నిర్మిస్తున్నట్టు చెప్పారు. వంతెన నిర్మాణంతో అన్నానగర్, రసూల్‌పురా బస్తీ, ఇక్రిశాట్ తదితర అనేక కాలనీలకు ముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని చెప్పారు. బేగంపేట నాలా పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. నాలా వెంట ఉన్న కాలనీల్లో డ్రయినేజీ, వాటర్ పైప్ లైన్ పనులు పూర్తయ్యాయనీ, రోడ్డు నిర్మాణం పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారు లను ఆదేశించారు. ఏండ్ల క్రితం నిర్మించిన నాలాల నిర్వహణను గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం, ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు కూడా వరద ముంపు సమస్యకు ఒక కారణంగా పేర్కొన్నారు. నాలాల వెంట ఉన్న ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. మంత్రి వెంట బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కిషన్, వాటర్ వర్క్స్ డైరెక్టర్ కృష్ణ, సుదర్శన్, వాటర్ వర్క్స్ రమణారెడ్డి, శానిటేషన్ శ్రీనివాస్, ఎలెక్ట్రికల్ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.