Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్
నవతెలంగాణ-సిటీబ్యూరో, కుత్బుల్లాపూర్
ప్రజా సమస్యలను గాలికి వదిలి కార్పొరేట్ల సేవలో మోడీ ప్రభుత్వం ఉందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్ అన్నారు. ఆదివారం సీపీఐ(ఎం) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్లీనం జిల్లాలోని కుత్బుల్లాపూర్ మండల పరిధిలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అదానీ, అంబానీల సేవలో మోడీ జపం చేస్తున్నాడని.. కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో మతోన్మాదాన్ని సృష్టిస్తున్నారన్నారు. కోట్లాది రూపాయలు కొద్దిమందికి రాయితీలు ఇచ్చి బ్యాంకులను కొల్లగొడుతున్నారని తెలిపారు. ఈడీ, సీబీఐలను ఉపయోగించి ప్రతిపక్షాలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. న్యాయవ్యవస్థను లెక్కచేయడం లేదన్నారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని అన్నారు. 73 రకాల జీవోలను సవరించకుండా పెండింగ్లో పెట్టి కనీస వేతనాలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు ప్రజలకు అనేక రకాల వాగ్దానాలు చేసి మోసం చేసిందని అన్నారు. గుడులు గోపురాల పేరుతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని వధా చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పి సత్యం మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై వెంటనే సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అభివద్ధిలో ఇంకా వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రవి చింతల యాదయ్య, ఏ అశోక్, ఎం.వినోద, జిల్లా కమిటీ సభ్యులు కీలుకానీ లక్ష్మణ్, వరప్రసాద్ వెంకటరామయ్య, జి.శ్రీనివాసులు, సబిత, నరేష్, ఏ శ్రీను తదితరులు పాల్గొన్నారు.