Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్
నవతెలంగాణ-హిమాయత్ నగర్
ప్రగతి భవన్ సీఎంఓ ఆఫీస్, రాజ్ భవన్ ల మధ్య జరిగే ఆధిపత్య రాజకీయాల వల్ల తెలంగాణ సమాజానికి తీవ్ర నష్టం జరుగుతుందని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు, సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూరి కష్ణ స్వరూప్ ఆరోపిం చారు. ఆదివారం హిమాయత్ నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కష్ణ స్వరూప్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యకలాపాలు జరగవలసిన ప్రగతి భవన్ రాజకీయ కార్యకలాపాలకు వేదికైందని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఆధిపత్య రాజకీయాల వల్ల తెలంగాణ సమాజానికి తీరని శాపంగా మారిందని ఆరోపించారు. ఉభయ పార్టీలు, రాజ్ భవన్, ప్రగతి భవన్ వర్గాలు తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి శ్రద్ధ చూపకుండా ప్రధానంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, వ్యవసాయ, నీటిపారుదల, పారిశ్రామిక, విద్యా, వైద్య, ఆరోగ్యం, సంక్షేమ రంగాల పట్ల, రాజ్యాంగం కల్పించిన దళిత బహుజన వర్గాలకు, రాజ్యాంగ హక్కుల పట్ల తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఇరువర్గాల వైఖరి వల్ల దళిత బహుజనుల సంక్షేమం అంధకారమైందన్నారు. శాసన సభ ఆమోదించిన పలు బిల్లులను సక్రమంగా రూపొందించకపోవడం వల్ల గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పారు. రాజ్యాంగ ప్రజాస్వామిక శాసన సభ వ్యవస్థలను అగౌరపరుస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో రాజ్ భవన్, ప్రగతి భవన్ వర్గాలపై చర్యలు తీసుకోవడానికి భారత రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చొరవ చూపాలని, పాలనా సంక్షోభం నుంచి విముక్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.