Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్లపై యథేచ్చగా తిరుగుతున్న ఇతర రాష్ట్రాల క్యాబ్‌లు
- ప్రయివేటు క్యాబ్స్ సంస్థలతో అనుసంధానం
- ఉపాధి కోల్పోతున్న స్థానిక డ్రైవర్లు
- నియంత్రించడంలో ఆర్టీఏ విఫలం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇతర రాష్ట్రాలకు చెందిన క్యాబ్‌లు, ఇతర వాహనాలు నగరంలో యథేచ్చగా తిరుగుతున్నాయి. పర్మిట్లు తీసుకోకుండా మోటారు వాహన నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి. సాధార ణంగా ఇతర రాష్ట్రాలకు చెందిన రవాణా వాహనాలు హైదరా బాద్‌లో తిరిగేందుకు టెంపరరీ పర్మిట్లు తీసుకోవాలి. మొదట్లో ఇలాంటి పర్మిట్లు తీసుకుంటున్న వాహనదారులు ఇక్కడే తిష్టవే స్తున్నారు. కొంతమంది ఓలా, ఉబర్ క్యాబ్ కంపెనీల్లో నమోదై తిరుగుతున్నాయని, ఇతర పొరుగు రాష్ట్రాల వాహనాలకు అవకాశం ఇవ్వకూడదనే నిబంధనను ఆయా కంపెనీలు తుంగలో తొక్కుతున్నాయని తెలంగాణ ట్యాక్సీ అండ్ డ్రైవర్స్ జేఏసీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదికాస్త గ్రేటర్ పరిధిలోని క్యాబ్‌లు, ఆటోల డ్రైవర్ల ఉపాధిపై ప్రభావం చూపిస్తోంది. కానీ ఇతర రాష్ట్రాల వాహనాలను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన రవాణాశాఖ పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పొరు గు రాష్ట్రాల వాహనాలు అక్రమ రవాణా అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రతీ మూడు నెలలకొకసారి క్రమం తప్పకుండా త్రైమాసిక పన్నులు చెల్లించి నిబంధనలకు అనుగుణంగగా నడిపే బయటి వాహనాల అక్రమ రవాణాతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని పలువురు డ్రైవర్లు చెబుతున్నారు.
కరోనా కారణంగా గడిచిన మూడేండ్లుగా క్యాబ్ డ్రైవర్లు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. గతంలో నగర రోడ్లపై ప్రతీరోజు సుమారు 80వేలకు పైగా క్యాబ్‌లు నడిచేవి. కోవిడ్ దెబ్బకు గ్రేటర్‌లోని ఐటీ కారిడార్లు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, హైటెక్ సిటీ తదితర ప్రాంతాలతో పాటు పర్యాటక స్థలాలకు రవాణా సేవలు స్తంభించిపోయాయి. ఫలితంగా క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లపై ఆధారపడిన వేలాది మంది ఆ రంగాన్ని వదులు కున్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో సాధారణ పరిస్థితులు నెలకొం టున్న తరుణంలో బయటి వాహనాలు నగరంలోకి ప్రవేశించడం, వాటిపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో స్థానిక డ్రైవర్లు ఆదా యం కోల్పోతున్నారు. ఓలా, ఉబర్ సంస్థలు ఇలాంటి వాహనాలకు ఇష్టారాజ్యంగా యాప్ ఆధారిత అనుమతులు ఇచ్చేస్తున్నాయి. అక్రమ రవాణాపై ఆర్టీఏ అధికారులు సైతం ఎలాంటి చర్యలు తీసు కోవడం లేదని పలువురు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటోలు సైతం 1.20లక్షలకుపైగా ఉండగా.. వీటిలో 10-15 వేల వరకు ఇతర జిల్లాల ఆటోలు నగరంలో యథేచ్చగా తిరుగుతు న్నాయని ఆటో సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆర్టీఏ నిబంధనల ప్రకారం గ్రేటర్‌లోని ఆర్టీఏ కేంద్రాల్లో నమోదైన ఆటోలు మాత్రమే తిరగాలి. కానీ బయటి ఆటోలు యథేచ్చగా తిరుగుతున్నా వాటిని అడ్డుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆటో డ్రైవర్ల జేఏసీ నాయకుడొకరు ఆరోపించారు.
గిరాకీల కోసం స్థానిక డ్రైవర్ల ఎదురుచూపులు
అసలే వేసవి సీజన్. ఈ సీజన్లో ఎండ తీవ్రతగా ఎక్కువగా ఉంటుంది. గిరాకీల కోసం చాలామంది తెలంగాణ మాక్స్, క్యాబ్స్, టాక్సీ వాహన డ్రైవర్లు ఎదురు చూస్తూంటారు, కానీ పొరుగు రాష్ట్రా లైన మహారాష్ట్ర, కర్నాటక వాహనాలు రాష్ట్రంలో ఓలా, ఉబర్, ఐటీలతో పాటు ట్రావెల్స్ కంపెనీలలో వ్యాపారం చేయడం ద్వారా స్థానిక డ్రైవర్లను కష్టాలకు గురిచేస్తున్నారని తెలంగాణ స్టేట్ ట్యాక్సీ అండ్ డ్రైవర్స్ జాక్ చైర్మెన్, కోచైర్మెన్ షేక్ సలావుద్దీన్, నగేష్ కుమార్, మహేందర్ రెడ్డి ఆరోపించారు. వాహనాలకు పన్నులు, బీమా కట్టి బుకింగ్ల్లేక తెలంగాణ టాక్సీ డ్రైవర్లు ఆగమవుతుంటే, పొరుగు రాష్ట్రాల వాహనాలు సరిహద్దు పన్ను కట్టకుండా, సరి యైన వాహనాల పేపర్లు లేకుండా, ఆన్లైన్లో వాహనాలు అటాచ్ చేసి ఓలా, ఉబర్, ఐటీ, ట్రావెల్స్, సెల్ఫ్ కార్ల పేరుతో తెలంగాణలో వాహనాలు నడిపిస్తున్నారని, అంతేకాకుండా ట్రాఫిక్ వారు ఇచ్చే మై వెహికల్ ఈజ్ సేఫ్ సర్టిఫికెట్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే తిరుగుతున్నారని, అలాంటి వాహనాలను ఇటీవలే మేడ్చల్ జిల్లా ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారని వారు గుర్తుచేశారు. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.