Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా నాయకులు చింతల యాదయ్య
నవతెలంగాణ-ఘట్కేసర్
ఎండా,వాన,చలిలో ఆరుగాలం కష్టపడి పల్లెలలో ప్రజలకు ప్రత్యక్ష సేవలందిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు గత నాలుగే నెలలుగా వేతనాలు చెల్లించకుండా వివక్ష పాటించడం శోచనీయమని, తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా నాయకులు చింతల యాదయ్య, సీఐటీయూ మండల కార్యదర్శి ఎన్ సబితలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఘట్ కేసర్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూని యన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు ఒక రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులకు సీఐటీయూ జిల్లా నాయకులు చింతల యాదయ్య పూలదండలు వేసి దీక్షలను ప్రారంభించారు. మండల అభివృద్ధి అధికారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు కరోనా వంటి విపత్కర పరిస్థితులలో సైతం పల్లెలను పరిశుభ్రంగా ఉంచారని, కరోనాతో చనిపోయిన వారిని వారి కుటుంబ సభ్యులు ముట్టుకోకపోయినా వారు ఎంతో మానవీయతతో శవాలను పూడ్చారని, అంత గొప్ప సేవలు అందించిన పంచాయతీ కార్మికులను గత నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా పస్తులు ఉంచడం సరైనది కాదన్నారు. తక్షణమే ప్రభుత్వం వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఎఫ్ ఈఎస్ఐ వంటి కనీస సౌకర్యాలు లేవని, ప్రమాదవశాత్తు మరణించిన వారికి ఎలాంటి బీమా సౌకర్యం కూడా లేదన్నారు. నైజాం కాలం నాటి వెట్టి చాకిరి నేటికీ చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల గోడు ప్రభుత్వం వినాలన్నారు సీఐటీయూ మండల కార్యదర్శి ఎన్ సబిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని జీవో నెంబర్ 51 ద్వారా తెచ్చిందని దీనివల్ల కారోబారు పంప్ ఆపరేటర్ తేడా లేకుండా అన్ని పనులు చేయాల్సి వస్తుందన్నారు తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలన్నారు. కనీస వేతనం రూ. 26వేల ఇవ్వాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మానుకొని గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలన్నారు. లేనిపక్షంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. మండల అభివద్ధి అధికారి సమస్యను పరిష్కరించటం పక్కకు పెట్టి దీక్షను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. కార్మికులను బెదిరించి పోలీసుల చేత అరెస్టులు చేయిస్తామని భయపెట్టించారన్నారు. తక్షణమే ఎంపీడీవో కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపాలన్నారు. దీక్ష శిబిరం వద్ద సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె కృషివల్లే నేటి మెజారిటీ సమాజం చదువులకు దగ్గర అయిందన్నారు. ఆమె ఆశయాల సాధన కోసం సీఐటీయూ కృషి చేస్తుందని చెప్పారు. గ్రామపంచాయతీ యూనియన్ అధ్యక్షులు, చంద్రమౌళి, కార్యదర్శి నరసింహ, సహాయ కార్యదర్శి కనకరాజు, ఎన్.పి.ఆర్.డి, సంఘం కార్యదర్శి కే చంద్రమోహన్, బిక్షపతి, బీ పద్మ, ఎల్లమ్మ, యాదమ్మ, పద్మ కిష్టమ్మ, గంగమ్మ, లక్ష్మమ్మ, భారతమ్మ, లావణ్య, రవి, కృష్ణ, సుజాత, తదితరులు పాల్గొన్నారు.