Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మెన్ డాక్టర్ చీమ శ్రీనివాస్
నవతెలంగాణ-అంబర్పేట
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిం చిన ఉద్యమకారుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పా టు చేసి, రూ.10 వేల కోట్ల బడ్జెట్ను కేటాయించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మెన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఫోరం చైర్మెన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం మాను కోట ప్రజా ప్రతిఘటన, మిలియన్ మార్చ్, సహాయ నిరాక రణ, సకలజనుల సమ్మె, సాగరహారం, సంసద్ యాత్ర, అసెంబ్లీ ముట్టడి తదితర అనేక కార్యక్రమాలను ఉద్యమ కారులు నిర్వహించినట్టు గుర్తు చేశారు. వీరిలో సుమారు 1200 మంది అమరులు తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేయగా, వేలాది మంది వివిధ అనారోగ్య కారణాలతో, ఆర్థికంగా నష్టపోయినవారు ఉన్నారన్నారు. రాష్ట్ర సాధన తర్వాత ఉద్యమకారులను ప్రభుత్వం విస్మరిం చడం సరైంది కాదన్నారు. వెంటనే ఉద్యమకారుల సంక్షే మం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో 20 శాతం తెలంగాణ ఉద్యమకారులకు కేటాయించాలని, పెన్షన్, ఉచిత బస్సు, ట్రైన్ పాసులు, ఆరోగ్య కార్డులు, ప్రతీ ఒక్కరికీ 300 గజాల ఇంటి స్థలం ఇవ్వాలన్నారు. తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించి గౌరవించాలని, అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ అవకాశాలు కల్పించాలని కోరారు. విద్యార్థి ఉద్యమకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రత్యేక కోటా కేటాయించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హరివర్థన్ రెడ్డి, ఫోరం ప్రధాన కార్యదర్శి పటోళ్ల సురేందర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు నరసయ్య, కన్వీనర్ ఐలయ్య యాదవ్, వెంకటేష్ గౌడ్, ఉపాధ్యక్షులు కొంతం వీరాస్వామి, జంగా సుదర్శన్, మహిళా అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.