Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ నగర అధ్యక్షుడు కుమారస్వామి
నవతెలంగాణ-అడిక్‌మెట్
రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని సీఐటీయూ నగర అధ్యక్షులు జె.కుమారస్వామి డిమాండ్ చేశారు. ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ గ్రేట్ర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఇందిపార్కు ధర్నా చౌక్‌లో కొనసాగుతున్న 48 గంటల రిలే నిరాహార దీక్షలో కుమార స్వామి ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ నగర కార్యదర్శి కె.అజరు బాబుతో కలిసి పాల్గొని మాట్లాడారు. రవాణా రంగ కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగి గాయపడితే, జబ్బు చేస్తే ఆదుకునే దిక్కులేదన్నారు. వీరి సంక్షేమానికి ఏ స్కీములు లేవనీ, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌పోర్టు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దేశ జీడీలో నాలుగు శాతం వ్యాట్ అందిస్తున్న రవాణా రంగాన్ని ప్రభుత్వాలు అశ్రద్ధ చేస్తున్నాయన్నారు. రవాణా రంగ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ట్రాన్స్‌పోర్టు కార్మికులు లేకపోతే పనులు ముందుకు సాగవనీ, అంత కీలకమైన వృత్తిలో ఉన్న రవాణా రంగా కార్మికులు నిత్యం ప్రమాదకరమైన జీవితాన్ని గడుపుతూ కూడా దేశానికి సర్వీస్ చేస్తున్నారన్నారు. రవాణా రంగ కార్మికుల సంక్షేమం కోసం పూనుకోవాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ట్రాన్స్‌పోర్టు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నగర ఉపాధ్యక్షులు రాములు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం మోటార్ వెహికల్ యాక్ట్ 2019ని తెచ్చి అగ్రిగేటర్స్ పేరుతో రవాణా రంగాన్ని మల్టీ నేషనల్ కంపెనీస్‌కి అప్పగించే కుట్ర చేస్తున్నదన్నారు. సింగిల్ ఓనర్ కం డ్రైవర్స్‌గా ఉండే వారు తట్టుకోలేని విధంగా భారాలు వేసి వేధిస్తున్నారన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ మన ఆదాయాలను కొల్లగొటుతున్నారన్నారు. ఈ భారాలకు వ్యతిరేకంగా డ్రైవర్స్ పోరాడాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగాన్ని ఆదాయ వనరుగా చూస్తూ భారాలు వేయడం,స్పెషల్ డ్రైవ్స్ పేరుతో చాలానాలు వేయడానికి చూపిస్తున్న శ్రద్ధ వారి జీవితాల్లో వెలుగులు నింపే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2019 మోటార్ వాహన చట్టంలో తెచ్చిన సవరణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలకు మద్దతుగా రాష్ట్ర కోశాధికారి, రాష్ట్ర అధ్యక్షుడు కె.సతీష్, నగర సహాయ కార్యదర్శి డీల్ మోహన్. నాయకులు కలీమ్, ఉమేష్ రెడ్డి, అహ్మదాన్, గౌస్, శ్యామ్, మహేష్, జునైద్, ఆర్బుస్ ఖాన్, మునీష్, అనీఫ్ తదితరులు కూర్చున్నారు. హరి, సురేష్, వాహిద్, ఫారీద్, మోహినుద్దీన్, మోయిన్, అబేద్, తదితరులు పాల్గొన్నారు.