Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారు అనాలోచిత నిర్ణయాలతో ఏడు వేల కుటుంబాలు రోడ్డు మీదకు..
- బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ వక్ఫ్ బాధితుల ఆమరణ దీక్షకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ నేతలు
నవతెలంగాణ-బోడుప్పల్
గత నలభైై సంవత్సరాల క్రితమే పట్టా భూములను లే అవుట్లు చేసి, ప్లాట్లుగా మార్చి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు చేసుకొని, అన్ని రకాల అనుమతులతో ఇంటి నిర్మాణాలు చేపట్టి వాటికి బ్యాంకు లోన్లు పొంది, ప్రతి ఏటా పన్నులు చెల్లిస్తూ వస్తున్న తమ భూములపై ఎవరో ఒకరు ఫిర్యాదు చేశారనే నెపంతో రాత్రికి రాత్రే సర్కారు అనాలోచిత నిర్ణయాలు తీసుకుని, కేవలం బోడుప్పల్లోనే ఏడువేల కుటుంబాలను రోడ్డు మీదకు తెచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికే చెల్లిందని టీ.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) అన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వక్ఫ్ బోర్డు బాధితుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలకు మద్దతు తెలిపేందుకు ఆదివారంనాడు దీక్షా శిబిరం వద్దకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ గత ముఫ్పై,Û నలభైౖ సంవత్సరాల క్రితమే లే అవుట్లు చేసి, ఇండ్లు నిర్మించిన స్థలాలను నేడు నిషేధిత జాబితాలో పెట్టడం వలన కేవలం బోడుప్పల్లోనే 7వేల కుటుంబాలు రోడ్డు మీదకు వచ్చాయని అన్నారు. కేసీఆర్ సర్కారు అనాలోచిత నిర్ణయాలకు పేద, మధ్యతరగతి ప్రజలు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. వక్ఫ్ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే వరకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటామని హమీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు మాట్లాడుతూ చట్టబద్ధమైన డిమాండ్ పరిష్కారం కోసం బోడుప్పల్ ప్రజలు చేస్తున్న పోరాటం ఫలించే వరకు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధ్దంగా ఉంటానని, త్వరలోనే సీసీఎల్ఏ కమిషనర్‌ను కలిసి సమస్యను వివరిస్తామని అన్నారు. మాజీ శాసన సభ్యులు, రైతు విభాగం జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి మాట్లాడుతూ బాధితులు ఎవ్వరూ కూడా ఆందోళనచెందవద్దని, అన్నీ చట్టపరంగా ఉన్నాయని, కేవలం ఎంఐఎం పార్టీ మెప్పు కోసమే వక్ఫ్ స్థలాలంటూ చీకటి జీవోలను తెచ్చిందని మండిపడ్డాడు.
సమస్య పరిష్కారం అయ్యే వరకు మల్లారెడ్డిని బోడుప్పల్లో తిరగనియ్యం
- టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రెష్ యాదవ్
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల ఓట్లతో గద్దెనెక్కి ప్రజల సమస్యలను విస్మరిస్తున్న మంత్రి మల్లారెడ్డి వక్ఫ్ భూముల సమస్యకు పరిష్కారం చూపేవరకు బోడుప్పల్లో అడుగుపెట్ట నియ్యమని టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ అసెంబ్లీ నియోజక వర్గ కోఆర్డినేటర్ తోటకూర వజ్రెష్ యాదవ్ అన్నారు. నలబై సంవత్సరాల నుండి ఇళ్ళు కట్టుకుని నివాసం ఉంటూ అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్న ప్రజలకు నేడు అవి మీ స్థలాలు కావాంటూ నిషేధిత జాబితాలో చేర్చడంతో అనేకమంది అవస్థలు పడుతు న్నారని వాపోయారు. పిల్లల చదువుల కోసమో, పెండ్లి కోసమే కనిపెట్టిన స్థలాలు నేడు నిషేధిత జాబితాలో పెట్టడంతో దిక్కుతోచని స్థితిలో ప్రజులున్నారని అవేదన వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యల కంటే నా ప్రాణాలు గొప్ప కాదు
కొత్త దుర్గమ్మ, కార్పొరేటర్ (ఆమరణ దీక్షలో కూర్చున్న వ్యక్తి)
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ ప్రజలు ఎంతో నమ్మకంతో నాకు ఓట్లేసి గెలిపించారని, అలాంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే నేను పోరాటం చెయ్యాలనే నిర్ణయానికి వచ్చానని, సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆమరణ దీక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించే పరిస్థితే లేదని, అరవై సంవత్సరాలకు పై బడిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ కొత్త దుర్గమ్మ తెలిపారు. ప్రజా సమస్యల కంటే నా ప్రాణాలు ఏం గొప్ప కాదని, అక్కడ దీక్షలో కూర్చున్న వారికి ధైైర్యం నింపారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ కార్పొరేటర్ కె.కిరణ్ కుమార్ రెడ్డి, గోనె శ్రీనివాస్, జేఏసీ నాయకులు కొత్త కిషోర్ గౌడ్, శ్రీధర్ రెడ్డిలతో పాటు వివిధ కాలనీలకు చెందిన అనేక మంది బాధితులు పాల్గొన్నారు.