Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇంజినీరింగ్ రంగంలో విశేష కృషి చేసినందుకు కిన్నెర- శోభకృత్ ఉగాది పురస్కారాన్ని ఆదివారం మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి అందజేశారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయనకు ఈ అవార్డును అందజేశారు. ఈ అవార్డు ప్రముఖ ఇంజినీర్, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారి 'రావుబహదూర్' బహుమతి గ్రహీత భావరాజు సత్యనారాయణ జ్ఞాపకార్థం అందిస్తున్నారు.
ఇదిలావుంటే పబ్లిక్ ప్రయివేటు పార్టనర్షిప్(పీపీపీ) పద్ధతిలో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మించడంలో ఎన్వీఎస్ రెడ్డి చేసిన అపార కృషిని ప్రశం సిస్తూ.. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ఇంజినీరింగ్, ఆర్థిక నవకల్పనను అనేక విధాలుగా ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. అనేక ఆందోళనలు, ఇతర అవరోధాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టును అమలు చేయడంలో ఆయన ఎదుర్కొన్న అసంఖ్యాక సవాళ్లను గుర్తించిన జ్యూరీ, అడ్డంకులను పరిష్కరించడంలో.. ఈ ప్రజా ప్రయోజన ప్రాజెక్ట్ను నిజం చేయడంలో ఆయన చూపిన సాహనం, పట్టుదల, చాకచక్యాలను ప్రశంసించింది. ఇతర రంగాల అవార్డు గ్రహీతలలో పొలీస్ రంగంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఎపీఎస్ఆర్టీసీ ఎండీ సీ.హెచ్ ద్వారకా తిరుమల రావు, న్యాయరంగంలో జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు, పరిపాలనా రంగంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేశ మాజీ ఐటీ అండ్ టెలికాం కార్యదర్శి రెంటాల చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి అధ్యక్షత వహించారు.