Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్లో లర్నర్స్పై ప్రత్యేక దృష్టి సారించాం
- ఏబీసీ గ్రూపులుగా విభజించి బోధిస్తున్నాం
- స్పెషల్ క్లాసుల సమయంలో స్నాక్స్ అందిస్తున్నాం
- ఒక నిమిషం ఆలస్యం నిబంధనలో సడలింపు
- హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిణి రోహిణి
నవతెలంగాణ-సిటీబ్యూరో
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి ణి ఆర్.రోహిణి అన్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నా రు. విద్యార్థులు నేర్చుకున్నది పరీక్షల్లో రాసేలా సంసిద్ధులను చేస్తు న్నామని వివరించారు. దాదాపు రెండు నెలలుగా స్పెషల్ క్లాసులు నిర్వహించడంతోపాటు స్నాక్స్ అందజేస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శద్ధ్ర తీసుకుంటున్నామని చెప్పారు. ఏప్రిల్ 3 నుంచి 13వరకు జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేశామన్నారు. సీసీ కెమెరాల నిఘా నీడలో మాస్ కాపీయింగ్, చూచిరాత ఘటనలకు తావులేకుండా పర్యవేక్షణకు సిద్ధం చేశామన్నారు. విధివిధానాలపై అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారనీ, ఎక్కడా పొరపాట్లకు తావివ్వొ ద్దనీ, సజావుగా పరీక్షలను పూర్తి చేయాలని ఆదేశించారని తెలి పారు. పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై మరిన్ని విషయాలను డీఈవో నవతెలంగాణకు వివరించారు.
నవతెలంగాణ : పరీక్షల నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
డీఈవో : పదో తరగతి వార్షిక పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే కలెక్టర్ అధ్యక్షతన ఆర్టీసీ, పోలీస్, పోస్టల్, విద్యుత్, వాటర్‌బోర్డు, వైద్య అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాం. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
నవతెలంగాణ : ఎన్ని పరీక్ష కేంద్రాల్లో.. ఎంతమంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు?
డీఈవో : మొత్తం 344 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. 68,744 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా.. 3,370 ప్రయివేటు విద్యార్థులతో కలిసి మొత్తం 72,114 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
నవతెలంగాణ : విధుల్లో ఎంతమందిని నియమిస్తున్నారు?
డీఈవో : జిల్లావ్యాప్తంగా 3వేల మంది ఇన్విజిలేటర్లు విధుల్లో ఉంటారు. ప్రతి సెంటర్లో ఒకరు చొప్పున 684 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లు పని చేస్తారు. 38 కస్టోడియన్లు, 38 జాయింట్ కస్టోడియన్లు, 17 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలను ఏర్పాటు చేశాం. వీరి పర్యవేక్షణలో సీసీ కెమెరాల వద్ద ప్రశ్నపత్రాలు తెరిచేలా చర్యలు తీసుకుంటాం.
నవతెలంగాణ : ఒక నిమిషం నిబంధన అమలులో ఉందా?
డీఈవో : ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. 8.45 నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తాం. ఈ ఏడాది ఒక్క నిమిషం నిబంధనలో కొంత సడలింపు ఇచ్చాం. 9.35 గంటలకల్లా విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లో ఉండాల్సిందే.
నవతెలంగాణ : పరీక్షలు సజావుగా జరిగేలా తీసుకున్న చర్యలేంటి?
డీఈవో : ప్రతి పరీక్ష కేంద్రంలో నిబంధనల ప్రకారం సీసీ కెమెరా లు ఏర్పాటు చేసి నిఘా పెడతాం. సమస్యసాత్మక సెంటర్లపై అదనపు నిఘా ఉంటుంది. మాల్ ప్రాక్టీస్, చూచిరాత వంటి ఘటనలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం. పరీక్ష జరిగే సమయాల్లో స్థానికంగా 144 సెక్షన్ అమలులో ఉంటుంది. సమీప జిరాక్స్ కేంద్రాలు తెరిచి ఉండకుండా చూస్తాం.
నవతెలంగాణ : పరీక్ష కేంద్రాల్లో కనీస వసతులు కల్పిస్తున్నారా?
డీఈవో : వేసవి నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సమస్య లేకుండా చూస్తున్నాం. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఒక ఏఎన్ఎం, ఆశా వర్కర్ అందుబాటులో ఉండేలా వైద్యశాఖ చర్యలు తీసుకుంటుంది. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్తు శాఖ, మరుగుదొడ్ల సదుపాయం, పాఠశాల ప్రాంగణాల్లో పరిశుభ్రత జీహెచ్ఎంసీ చూసుకుంటుంది. పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడపనున్నారు.
నవతెలంగాణ : ఫలితాలపై ఎలాంటి దృష్టి సారిస్తున్నారు?
డీఈవో : ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. గతేడాది కంటే ఈసారి మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తున్నాం. ముఖ్యంగా వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి వారిని సమాయత్తం చేస్తున్నాం. ఉదయం, సాయంత్రం వేళల్లో స్పెషల్ క్లాసులు నిర్వహించడంతో పాటు స్నాక్స్ అందజేస్తున్నాం. విద్యార్థులు సులువుగా నేర్చుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా మెటీరియల్‌ను సరఫరా చేశాం. కేవలం పాఠాలు బోధించి.. చదువుకోవాలని చెప్పి ఊరుకోకుండా.. విద్యార్థుల దృష్టి చదువుపై కేంద్రీకరించేలా.. ఉదయం 5గంటలకు వేకప్ కాల్స్ చేసి నిద్ర లేపుతున్నాం. నిరంతరం పేరెంట్స్‌తో మాట్లాడే బాధ్యతలను ఉపాధ్యాయులకు అప్పగించాం. డిప్యూటీ ఈవోలు, హెచ్ఎంలతో మీటింగ్‌లు నిర్వహించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.