Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీనియర్ జర్నలిస్ట్, హాస్యబ్రహ్మ డాక్టర్ శంకర్ నారాయణ
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కవులు రచించే కవితల్లోని కమ్మదనం వర్ణించలేనిదని రవి కాంచని చోట కవి ప్రకాశిస్తాడని హాస్యవధాని, సీనియర్ జర్నలిస్ట్, హాస్యబ్రహ్మ డాక్టర్ శంకర్ నారాయణ అన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ పరిధి మగ్దూంనగర్లోని చైతన్య విద్యానికేతన్ హై స్కూల్ క్యాంపస్ హాల్లో చైతన్య కళానికేతన్ సాహితీ సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు శివరాత్రి యాదగిరి, ప్రధాన కార్యదర్శి వాకిటి రామిరెడ్డిల ఆధ్వర్యం లో ఏర్పాటుచేసిన శోభక్రుత్ నామ ''ఉగాది కవి సమ్మేళనం'' కార్యక్రమానికి ఆయనతోపాటు తెలుగు సాహిత్య పీఠం అధ్యక్షులు చిక్క రామదాసు, శతాధి గ్రంథకర్త డాక్టర్ మలుగ అంజయ్య శతావధానిలతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో సుమారు 30మందికి పైగా కవులు తెలుగు సంస్కృతి, సాంప్రదాయాల విశిష్టతను కవితల రూపంలో వారి ప్రతిభ పాటవాలను వర్ణించారు. పాటల రూపంలో గేయాలు పాడారు. డాక్టర్ మలుగ అంజయ్య శతావధాని అధ్యక్షతన ఈ ఉగాది కవి సమ్మేళన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా అతిథులు, వక్తలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కవులకు, కళారంగానికి ఎంతో చేయూతనందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఎంతోమంది పేద కవులు ఉన్నారని, ప్రభుత్వం వారికి అండగా ఉండి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి మనిషిలో ఏదో చేయాలనే తపన ఉంటుందని, దానిని వెలికితీసి బాహ్య ప్రపంచానికి తెలియజేస్తే వాటి గొప్పతనం మరువలేని అనుభూతి అన్నారు. ప్రస్తుతం రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల నేటి యువత మొబైల్, టీవీ వాడకంతో మునిగిపోయి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. రానున్న కాలంలో కవుల విశిష్టత, కవితల విశిష్టత, కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తపరిచారు.
చైతన్య కళానికేతన్ సాంస్కృతిక సంస్థ అధ్యక్ష కార్యదర్శులు శివరాత్రి యాదగిరి, వాకిటి రామ్రెడ్డిలు మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉగాది కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసి ఎంతో మంది కవులను ఒక వేదికపైకి తీసుకువచ్చి, వారి ప్రతిభను తెలియజేస్తున్నా మన్నారు. సంస్థ ఆధ్వర్యంలో భవిష్యత్తులో కూడా సామాజిక సేవలు విస్తృతం చేస్తామన్నారు. అనంతరం కవులను, జర్నలిస్టులను సంస్థ ఆధ్వర్యంలో మెమెంటో, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మంగ యాదగిరి, కవులు డాక్టర్ నందనం సృజనాకర్ సత్యనారాయణ భట్, సింగం రమేష్ సింగం సంధ్యారాణి, మాపల్లె శంకర్, డాక్టర్ వేముల సత్యనారాయణ, సిహెచ్. కోమల, డాక్టర్ వంగర విష్ణు, టి.కనకాచారి, ఇన్చార్జి గీత, సీనియర్ జర్నలిస్ట్ సరస్వతి, నరేందర్, రాజు, వి .నాగరాజు, మంజుల రెడ్డి, ఎం.దివాకర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.