Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేపర్ లీక్‌తో కళ తప్పిన ఓయూ ప్రధాన గ్రంథాలయం
- వడ్డెర బస్తి నుంచి ఇంటిదారి పట్టిన నిరుద్యోగులు
నవతెలంగాణ-ఓయూ
గత సంవత్సరం కాలం నుంచి వివిధ రకాల ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ కావడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం డా.బి.ఆర్.అంబేద్కర్ గ్రంథలయం విద్యార్థులు, నిరుద్యోగులతో ఉదయం నుంచి రాత్రి వరకు కళకళ లాడిన విషయం తెలిసిం దే.కూర్చోడానికి సీట్లు లేక ఇబ్బందులు పడ్డ పరిస్థితి. కానీ ఇటీవలే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కావడంతో పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా మారిపోయింది. దానికి ఉదాహరణయే ఓయూ లైబ్రెరీ, వడ్డెర బస్తి, ఓయూలో పలు రూమ్స్ అని చెప్పాలి..
కొందరు ఇంటిదారి, ఇంకొందరికి ఇండ్లు అంటే జంకు..
టీఎస్పీఎస్సీపై నమ్మకాన్ని కోల్పోయిన పలువురు విద్యార్థులు, నిరుద్యోగులు ఆశలు ఆడిఆశాలయ్యాయి. కొందరు ఇంటిదారి పట్టారు. ఇంకొందరు జాబ్ లేకుండా ఇంటికి ఎం ముఖం పెట్టుకొని పోవాలి అంటు సహా విద్యార్థులు, మిత్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంసిద్ధతతో నిరుద్యోగులు..
ఇక కొందరు యూనివర్సిటీలో నాన్ బోర్డర్స్ గా ఉండలేక ఇంకొందరు వడ్డెర బస్తీలో కిరాయి చెల్లించలేక తీవ్రమైన నిరాశలో, ఒత్తిడి లో ఉన్నారు. మళ్లీ పరీక్షలు కూడా జరుగుతాయా ? లేవా ? అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఓయూలో విద్యార్థులు, నిరుద్యోగుల్లో నెలకొంది. పేపర్ లీకేజీ వల్ల ఇటీవలే జరిగిన డీఏఓ, ఏఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే వీటిలో కేవలము గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 11న,నిర్వహిస్తామని గ్రూప్2 ఆగస్ట్ 28, 29 తేదీలలో నిర్వహిస్తామని, టీఎస్పీఎస్సీ చెప్పినప్పటికి సిట్ దర్యాప్తు నేటికీ పూర్తి కాకపోవడంతో ఈ పేపర్ లీకేజీ వ్యవహారం లో అసలు ఎవరు బాధ్యులు అన్నది తెలియకుండా ,టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయకుండా తదుపరి పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీనే చెప్పే విష యాన్ని నమ్మలేకపొతున్నారు నిరుద్యోగులు. ఇదిలాగ ఉండగ టీఎస్ఎల్పీఆర్బీ పోలీసు బోర్డ్ భవిష్యత్తులో నిర్వహించే ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలు ఎంత వరకు నిబద్ధతతో నిర్వహిస్తారనే ఆందోళనలొ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉన్నారు.కొందరు తెచ్చుకున్న డబ్బులు ఖర్చు కావడంతో వివిధ పార్ట్ టైమ్ జాబ్స్ వేటలో పడ్డారు. మొత్తానికి మాత్రం విద్యార్థులు అసహనం అసంతృప్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ, యువతి యువకులకు ఎంత వరకు ఆత్మస్థైర్యంను భరోసాను కల్పిస్తుందో వేచి చూడాల్సిందే.
నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చలగాటం
తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాల నుండి ఉద్యోగాల కోసం చదువుతున్న నేను, నా మిత్రులు ఎంతో మా విలువైన కాలాన్ని వెచ్చిస్తూ గ్రామాల నుంచి వచ్చి పొట్ట చేత పట్టుకొని ఓయూ లైబ్రరీలో చదువుతున్నాము. కానీ పేపర్ లీకేజ్ వ్యవహారంతో టీఎస్పీఎస్సీ తన విశ్వసనీయతను కోల్పోయింది. ఇందులో పాత్రధారులు ఎవరు ఉన్నా కూడా ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఇది ఇద్దరు వ్యక్తులు చేసినటువంటి తప్పు అని చెప్తున్నప్పటికీ ప్రభుత్వం విచారణ సంస్థ సిట్‌కు కేసును అప్పగించింది. ఇందులో ఇప్పటివ రకు ఇద్దరు వ్యక్తులతో పాటు పదిమంది వరకు అరెస్ట్ అయ్యారు. అలాగే 100 మందికి పైగా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇద్దరు వ్యక్తులే అని చెప్పడం ఎంతవరకు సమంజసం.తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తుఫాన్లు వరదలు వచ్చాయి కానీ ఏనాడు కూడా స్పందించని ముఖ్యమంత్రి అకస్మాత్తుగా రైతుల మీద ప్రేమను కురిపించడానికి కారణం నిరుద్యోగుల సమస్య, అలాగే పేపర్ లీకేజీ వ్యవహారాన్ని పక్కదో పట్టించడమే. పేపర్ లీకేజీ వ్యవహారంతో 30 లక్షల మంది నిరుద్యోగులు ఆత్మ న్యూనత భావంతో ఉన్నారు. ఈ విషయం మీద సీఎం ఇంతవరకు మాట్లాడలేదు. నిరుద్యోగుల మీద ముఖ్యమంత్రికి ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా, అలాగే ఓయు కేంద్రంగా నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే కూడా ఇప్పటివరకు టీఎస్పీఎస్సీని రద్దు చేయకుండా నిరుద్యోగులను అరెస్టులతో బయపెడుతూ మభ్యపెడుతున్నారు. నోటిఫికేషన్ సమయంలో ఓయూ లైబ్రరీలో కూర్చోవడానికి కూడా స్థలం ఉండేది కాదు. అంత మంది నిరుద్యోగులు ఈ ఒక్క నోటిఫికేషన్‌తో మా జీవితాలు బాగుపడతాయని ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కానీ టీఎస్పీఎస్సీ నిర్వాకం వల్ల ఈరోజు లైబ్రరీ బోసిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు ఎక్కడ నుంచి వచ్చారో మళ్లీ అక్కడికి వెళ్ళిపోయారు. వీళ్లకు భరోసా కల్పించేది ఎవరు? వీళ్లకు బాసటగా నిలిచేది ఎవరు? ఇప్పటికైనా ప్రభుత్వం కండతెరిచి టీఎస్పీఎస్సీని వెంటనే రద్దు చేసి కొత్త బోర్డును రాజకీయాల కతీతంగా ఏర్పాటు చేయా లి. పరీక్షలను ఎటువంటి లీకేజీ లేకుండా ప్రతీ ఒక్క అభ్యర్థి పేరును ఫలితాలప్పుడు ప్రకటి స్తూ తమ విశ్వాసంను ప్రదర్శించాలి. ఆందోళనతో ఉన్న మా నిరుద్యోగులకు భరోసాను కల్పించాలి.
-ఓయూ పీహెచ్డీ విద్యార్థి, గ్రూప్స్ ఆశావహులు ఎస్.క్రాంతి నాయక్